మరోసారి అదే శైలిలో ప్రయత్నిస్తున్నాడా?

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రేమ కథలు తీర్చి దిద్దిన తీరు ఆయనకు యువతలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాయి. వీటిల్లో సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ చేసిన అతి పెద్ద సాహసం అనే చెప్పాలి. ఒక ప్రేమ కథకు యాక్షన్ అంశాలు జోడించటమే కష్టంతో కూడుకున్న పని. అటువంటిది గౌతమ్ మీనన్ ప్రేమ కథకు యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా జోడించి సాహసం శ్వాసగా సాగిపో కథను ఉత్కంఠ భరితమైన కథనంతో తెరకెక్కించారు. అయితే తొలి నుంచి విడుదలలో జాప్యం జరుగుతుండటం, పైగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చిత్రం విడుదల కావటంతో బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ఈ చిత్రం ప్రభావం చూపనప్పటికీ ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది.
సాహసం శ్వాసగా సాగిపో చిత్రం తరువాత గౌతమ్ మీనన్ తన దృష్టి అంతా ధనుష్‌తో చెస్తున్న ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట చిత్రంపై కేంద్రీకరించారు. ఈ చిత్ర పోస్టర్స్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఆ పోస్టర్స్‌లో ధనుష్ గడ్డంతో మాస్ లుక్ లోనూ, మరొక పోస్టర్లో హీరోయిన్ మేఘ ఆకాష్ తో రొమాంటిక్ ముద్దులతోనూ కనిపిస్తుండటంతో గౌతమ్ మీనన్ మరొక సారి ప్రేమ కథలో యాక్షన్ అంశాలు పుష్కలంగా నింపి చిత్రం తెరకెక్కిస్తున్నాడేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చిత్రం విడుదల వరకు ఈ సందేహాలకు సమాధానం దొరికే అవకాశమే లేదు.
2017 వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. రఘువరన్ బి.టెక్, నవ మన్మధుడు, ధర్మ యోగి చిత్రాలతో తెలుగులోనూ మార్కెట్ ఏర్పరుచుకున్న ధనుష్ కు ఈ చిత్రం మరింత సహాయపడనుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి తమిళంతో పాటు తెలుగు, మళయాళ భాషల్లో వున్న గుర్తింపు ఇందుకు కారణం.

