మరొక్క నెలలోనే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

బాలకృష్ణ జై సింహ సినిమా పరాజయంతో తన తండ్రి బయో పిక్ విషయంలో కాస్త వెనక్కి తగ్గాడని న్యూస్ వినబడడమే కాదు.. పైసా వసూల్ షూటింగ్ సమయంలో భుజానికి అయిన గాయం తిరగబెట్టడంతో ఒక చిన్న ఆపరేషన్ చేయించుకుని రెండు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడని.. అందుకే ఎన్టీఆర్ బయో పిక్ స్టార్ట్ కావడం లేట్ అవుతుందనే న్యూస్ సోషల్ ఇండియాలో హల్చల్ చేస్తుంది. అయితే బాలయ్య భుజానికి గాయం నిజమైనా.. బాలయ్య రెస్ట్ అనేది రూమర్ గానే వినబడుతుంది. ఎందుకంటే తన తండ్రి బయో పిక్ ని బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.
బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ బయో పిక్ మార్చి నాలుగున మొదలుకాబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ దాదాపు 60 గెటప్స్ లో కనబడతాడనే టాక్ కూడా ఉంది. ఎన్టీఆర్ బయో పిక్ సినిమాలో బాలయ్య వెయ్యబోయే 60 గెటప్స్ హైలెట్ గా చెబుతున్నారు. ప్రస్తుతానికి నటీనటుల ఎంపికకు సమయం పడుతుందని.. త్వరలోనే ఈసినిమాలో నటించబోయే నటీనటుల వివరాలతో పాటు ఈ సినిమాకి పనిచెయ్యబోయే టెక్నీషియన్స్ వివరాలు అధికారికంగా తెలియజేస్తారని సమాచారం ఉంది. ఇకపోతే జనవరి 18 నే ఎన్టీఆర్ వర్ధనతి సందర్భంగా ఈ ఎన్టీఆర్ బయో పిక్ మొదలు కావాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ టీజర్ కూడా విడుదలవుతుందని అన్నారు. కానీ ఆ టీజర్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఎన్టీఆర్ బయో పిక్ టీజర్ విడుదల వాయిదా పడింది.
ఈ విషయమై దర్శకుడు తేజ మీద బాలయ్య కాస్త గుర్రుగా ఉన్నాడనే న్యూస్ కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య - సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇందిరాగాంధిగా ఎవరు నటించబోతున్నారో అనేది ఇంకా సస్పెన్స్. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు

