మద్రాస్ లో బొంబాయి హీరో జోరు

దళపతి, రోజా, బొంబాయి, సఖి వంటి ప్రముఖ దర్శకుడు మని రత్నం సృష్టించిన ఆణిముత్యాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు అరవింద్ స్వామి. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాలలో ప్రతినాయకుడి పాత్ర గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ కథలు కథలుగా చెప్పుకుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే అది తన్ని ఊరువం చిత్రంలోని ప్రతినాయకుడి పాత్రే. ఆ పాత్రకు జీవం పోసి అంతటి కీర్తిని గడించిన నటుడు మరెవరో కాదు అరవింద్ స్వామే. సుదీర్ఘ విరామం తర్వాత కూడా తనలోని నటుడి ప్రతిభ ఏ మాత్రం మరుగున పడలేదని నిరూపించారు అరవింద్ స్వామి.
90 ల దశకపు నటులు అందరూ విరామం తీసుకుంటూనో, నటన మీద మమకారం చంపుకోలేని వారు యువ నటుల చిత్రాలలో వయసుకి తగ్గ పాత్రలు వేస్తుండగా, అరవింద్ స్వామి మాత్రం కథానాయకుడిగా ఒకే వారంలో మూడు తమిళ చిత్రాల ఒప్పందాలపై సంతకం చేసి తన జోరు ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించారు. సధురంగా వెట్టై చిత్రానికి సీక్వెల్ చిత్రంలో త్రిష తో జతకడుతున్నారు. భాస్కర్ ది రాస్కేల్ అనే మళయాళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార తో తెరను పంచుకోనున్నారు. రమణ అనే తమిళ దర్శకుడితో మరో చిత్రానికి సంతకానికి చేసారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో మంజు వారియర్ కథానాయికగా నటించనున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ధ్రువ చిత్రం తన్ని ఉరువన్ కు రీమేక్ అన్న సంగతి విదితమే. ఆ చిత్రంలో అరవింద్ స్వామి పాత్రను తెలుగులో కూడా ఆయనే పోషించనున్నారు.

