మణిరత్నంను మెప్పించి డెబ్యూ పట్టాలెక్కించాడు

ప్రేమ కావ్యాలు తెరకెక్కించటంలో, పైగా వైవిధ్యమైన ప్రేమ కథలను తెరపై ఆవిష్కరించడంలో మణిరత్నం శైలే వేరు. మౌన రాగం, గీతాంజలి, బొంబాయి, సఖి, ఓకే బంగారం ఇలా ఆయన చెప్పిన ప్రతి ప్రేమ కథ వినూత్నంగానే ఉంటుంది. ఆయనను చూసి స్ఫూర్తి పొంది దర్శకులుగా మారినా వారి జాబితా చాలా పెద్దదే. అయితే వారందరు మణిరత్నం శైలిలో కథను తెరకెక్కించటంలో సక్సెస్ కాలేకపోవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాత్రం మణిరత్నం శైలికి అతి చేరువలో వున్నాడు. ఆయన చెప్పిన ప్రేమ కథలు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం.
అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన పరిచయ చిత్రానికి మణిరత్నం కి కథ చెప్పి ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంట. చెలి చిత్రంతో పరిచయం ఐన గౌతమ్ తొలి ప్రయత్నంగా చాలా సాదా సీదా ప్రేమ కథను తీసుకున్నారు. అటువంటి అతి సాధారణమైన ప్రేమ కథను మణిరత్నం కి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన పడ్డ ఇబ్బంది గురించి చెప్తూ, "చెలి సమయంలో నేను మాధవన్ ని హీరోగా అనుకున్నాను. మాధవన్ అప్పటికే మణిరత్నం గారి దగ్గర సఖి కి పనిచేసి హిట్ కొట్టాడు. ఆయనకీ మణిరత్నం గారి స్క్రిప్ట్ జడ్జిమెంట్ పై నమ్మకం ఎక్కువ. నన్ను మణిరత్నం గారి ముందు కూర్చోబెట్టి చెలి కథ చెప్పమన్నాడు మాధవన్. అంత సాధారణమైన కథ చెప్పి ఆయన విలువైన గంట సమయాన్ని వృధా చేసాను. కానీ నా నేరెషన్ కి ఎక్కడో కనెక్ట్ ఐన మణిరత్నం గారు మాధవన్ కి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వటంతో నా తొలి చిత్రం పట్టాలెక్కింది." అని తన తొలి చిత్ర అనుభవాలను పంచుకున్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.
గౌతమ్ దర్శకత్వం వహించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న సంగతి విదితమే.

