బేర్ మంటున్న మాజీ జేమ్స్ బాండ్.

హీరో ఇమేజ్ కు, డీల్ కుదుర్చుకున్న బ్రాండ్ కు సంబంధం లేకపోతే ఆ ప్రయోగం కాస్తా పేలిపోయి తల బొప్పికడుతుంది. మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ పరిస్థితి కూడా ఇప్పుడు లాగే తయారైంది. ఒకప్పుడు చేతిలో గన్, చుట్టూ నలుగురు అమ్మాయిలతో ఫోజు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ తేనెకళ్ల హీరో... ఇప్పుడు భారత్ లో తన పరువు పోయినందుకు బేరుమంటున్నాడు. దీనికంతా కారణం అతడు చేసిన ఒక పాన్ మసాలా యాడ్. లేటెస్టుగా పియర్స్ బ్రాస్నన్ కనిపిస్తున్న పాన్ బహార్ యాడ్ బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది.
ఇదే నెటిజన్లకు కోపం తెప్పించింది. ప్రజల ఆరోగ్యం పాడు చేసే పాన్ మసాలా యాడ్ చేస్తున్నందుకు మాజీ జేమ్స్ బాండ్ పై వ్యతిరేక పోస్టులు చేసేలా చేసింది. ఇకేముంది.. ఎవరో ఒకరు కక్కిన ఆగ్రహం అలా ఆలా ఆన్ లైన్ అంతా అల్లుకుపోయింది. చివరకు ఇది పియర్స్ బ్రాస్నన్ చెవిన కూడా పడింది. ఇంకేముంది షాక్ అయ్యాడు జేమ్స్ బాండ్. ప్రొడక్ట్ ఏంటో తెలీకుండా దాన్లో చేసినందుకు తనను తాను తిట్టుకుంటున్నాడు. తన ఇమేజ్ ను గంగపాలు చేసిన పాన్ మసాలా కంపెనీపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. దశాబ్దాల పాటు మహిళల ఆరోగ్యం, పర్యావరణ రక్షణ గురించి ప్రచారం చేస్తున్న తను ప్రజల ఆరోగ్యాన్ని హరించే పాన్ మసాలా యాడ్ చేశానని తెలుసుకుని చింతిస్తున్నానన్నాడు.
దీన్లో హాని చేసే పదార్థాలేవీ లేవని చెప్పే తనతో ఎండోర్స్ చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నాడు బ్రాస్నన్. ఈ యాడ్ చేసినందుకు ప్రజలను క్షమాపణ అడిగాడు. కానీ మన హీరోలు కూడా ఇలా యాడ్స్ చేసేసి తర్వాత ఆకులు పట్టుకున్నారని మాజీ జేమ్స్ బాండ్ గారికి తెలీదు పాపం.. ప్రిన్స్ మహేష్ లిక్కర్ యాడ్ చేసేసి తర్వాత నాలిక్కరుచుకోగా.. అజయ్ దేవగన్ పాన్ మసాలా యాడ్ పైనా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇవి కనిపించడం లేదనుకో. కానీ పియర్స్ బ్రాస్నన్ చేసిన పాన్ మసాలా యాడ్ మాత్రం.. ఇకమీదట ప్రసారం అవుచుంజా లేక ఆపేస్తారా చూడాలి.

