బుల్లి తెర యాంకర్ దర్శకత్వంలో కింగ్ నాగ్

అక్కినేని కుటుంబంలో ఇద్దరు హీరోలు చాలా బిజీగా వున్నారు. ఆ ఇద్దరు యువ నటులు చైతు, అఖిల్ అనుకునేరు... అక్కినేని నాగ చైతన్య కు సమానం గా ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తూ బిజీగా వున్నారు కింగ్ నాగార్జున. గడిచిన గత రెండు సంవత్సరాలలో ఆయన నమోదు చేసిన మూడు భారీ విజయాలు మళ్లీ ఆయనని ఫామ్ లోకి తీసుకువచ్చాయి. సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ తో పని చేసే వెసులుబాటు నాగార్జునకి వున్నా కూడా కొత్త వారిని, ఒకటి రెండు చిత్రాల అనుభవం వున్న దర్శకులను అవకాశాలు ఇచ్చి ఆయన చిత్రాల ద్వారా ప్రోత్సహిస్తుంటారు నాగార్జున.
బుల్లి తెరపై యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుని వెండి తెర పై చిత్రాలు తీస్తున్న దర్శకుడు ఓంకార్ తొలి ప్రయత్నం జీనియస్ నిరాశ పరిచినప్పటికీ అతి తక్కువ వ్యయంతో రాజు గారి గది అనే హారర్ కథను తెరకెక్కించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. ఒక మళయాళ చిత్రాన్ని రీమేక్ చేసే పనుల్లో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నాడు ఓంకార్. ఇదే చిత్రంలో మాంత్రికుడిగా దర్శనమివ్వబోతున్నాడు కింగ్ నాగార్జున. మళయాళ చిత్ర నాగ్ కి బాగా నచ్చటంతో ఓంకార్ తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి ఇచ్చిన నేరేషన్ కి కన్విన్స్ అయ్యాడు నాగ్. నాగ్ తో ఊపిరి వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పీ.వి.పీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ ఆదివారమే ఈ చిత్రం ముహూర్తం జరుపుకోనుంది. కానీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం కావటానికి కొంత సమయం పడుతుంది అని సమాచారం. నాగార్జున ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర చిత్రీకరణ పూర్తి ఐన తరువాత ఓంకార్ చిత్రానికి డేట్స్ ఇవ్వనున్నారు.

