బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడా.?

ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటున్న తారలు మరోపక్క వేరే వ్యాపార మార్గాలు వెతుక్కుంటూ బిజీ, బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ ఇతర వ్యాపారాలతో బిజీ అవ్వడానికి కారణం మాత్రం సినిమాలు లేనపుడు జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడడానికి ఈ వ్యాపారాలే వారికి పనికొస్తాయి కాబట్టి.... ఇలాంటి మార్గాల్ని ఎంచుకుంటున్నారు వీరు. టాలీవుడ్ లో అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఒక పక్క టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే మరో పక్క వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ బ్రాండ్ ఎఫ్ 45 జిమ్ లను నాలుగైదు చోట్ల ఓపెన్ చేసింది ఈ భామ. అలాగే నితిన్ కూడా సినిమాలో కొనసాగుతూనే మరో పక్క హోటల్ రంగంలోకి దిగాడు. ఇలాంటి పనులు చేస్తున్న తారలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.
ఇప్పుడు వీరి జతకు యంగ్ హీరో నిఖిల్ కూడా చేరాడు. రకుల్ ప్రీత్ ఎఫ్ 45 బ్రాండ్ లో... నిఖిల్ కూడా తాజాగా అసోసియేట్ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ తాజాగా సికింద్రాబాద్ లో ఎఫ్ 45 న్యూ బ్రాంచ్ ని ఒకదాన్ని ఓపెన్ చేశాడు. ఇక దీంతో పాటే త్వరలోనే 6 న్యూ జిమ్ సెంటర్లు ఏర్పాటు చేసే పనిలో నిఖిల్ ఉన్నాడని తెలుస్తుంది. వరుస విజయాలతో హిట్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ ఇప్పుడు వ్యాపారంగంలో కూడా అదే సక్సెస్ ఫార్ములాతో దూసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఎఫ్ 45 అంటే రకుల్ ప్రీత్ అనుకునే వాళ్లకు ఇప్పుడు మాత్రం అందులో నిఖిల్ కూడా భాగస్వామి అయ్యాడనే విషయం అర్ధమవుతుంది.

