బాహుబలి ఛాన్సును తిరస్కరించిన సీనియర్ నాయిక

బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో పొరుగు రాష్ట్రాల్లో గుర్తింపు లేని ప్రభాస్ వంటి నటుడికి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. మరో వైపు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూర్య వంటి మేటి తారలు కూడా బాహుబలి చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ బృందంలోనైనా కనిపిస్తామని జక్కన్న రాజమౌళికి సోషల్ మీడియా ముఖంగా అర్జీ పెట్టుకున్న సంగతి విదితమే. అంతటి ప్రాచుర్యం పొందిన బాహుబలి చిత్రానికి ఒక ముఖ్య పాత్ర పోషించమని ఒక సీనియర్ హీరోయిన్ ని రాజమౌళి సంప్రదించగా ఆవిడ ఆ అవకాశాన్ని తిరస్కరించారు. బాహుబలి అవకాశం వదులుకున్న పాత తరం కథానాయిక మరి ఎవరో కాదు. రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వంటి ప్రముఖ నటుల సరసన ఆత్మ గౌరవం, మంచి కుటుంబం, వీరాభిమన్యు, అవే కళ్ళు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన కాంచన.
దర్శకుడు రాజమౌళి ఒక కీలక పాత్ర కోసం కాంచనను సంప్రదించగా చిత్రీకరణ ప్రదేశాన్ని గురించిన వివరాలు ముందుగా వాకబు చేసిన అలనాటి నటి కాంచన వెంటనే మరో ప్రస్తావన లేకుండా తిరస్కరించినట్టు సమాచారం. బాహుబలి లో పాత్రానుసారం ఆవిడ జోధ్ పూర్ లోని ప్రదేశాలలో చిత్రీకరణలో పాల్గొనాల్సి రావటమే ఈ తిరస్కారానికి కారణం అని తెలుస్తుంది. తన ఆరోగ్య రీత్యా తాను జోధ్ పూర్ ప్రాంతంలో వింటర్ సీజన్ లో పని చేయలేనని ఆవిడ బాహుబలి వంటి చిత్రమైనప్పటికీ ఆరోగ్య పరంగా ఇబ్బంది పడలేనని తేల్చి చెప్పారట.
మరో వైపు కాంచన పెళ్లి చూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కనున్న అర్జున్ రెడ్డి చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ హైద్రాబాద్ నగర పరిసర ప్రాంతాలలోనే జరగనుంది.

