బాలీవుడ్ లో తెరకెక్కనున్న కరణం మల్లీశ్వరి!

కథ అంటే కల్పిత సన్నివేశాల సమూహారం అని పాత నానుడి. నేటి తరానికి మాత్రం ఈ నానుడి మింగుడుపడదు. దీనికి కారణం సహజత్వ కల్పితాలను అనేక చిత్ర కథల ద్వారా మన పూర్వ కాలపు సినిమా రచయితలు ప్రేక్షకులకు రుచి చూపించేసారు. ఇక నేటి తరం దర్శక రచయితలు వాటికి బిన్నంగా ఉండటానికి అని ఊహకు అందని కల్పితాలు కొన్ని ఆవిష్కరిస్తున్నప్పటికీ వాటిలో అరుదుగా ప్రేక్షకులను కదిలించగలుగుతున్నాయి. అందుకే భారత దేశంలో నిర్మితమవుతున్న చిత్రాలలో చారిత్రక కథలకు, నిజ జీవిత కథలకు ఆదరణ పెరిగింది. ది డర్టీ పిక్చర్, మేరీకోమ్, బాజీరావు మస్తానీ, ఎం.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ, రుద్రమదేవి, ఇప్పుడు రానున్న గౌతమి పుత్ర శాతకర్ణి, పుల్లెల గోపీచంద్ జీవిత కథగా తెరకెక్కనున్న తెలుగు చిత్రం, అభినయ తార సావిత్రి గారి జీవితాన్ని తెరపై ఆవిష్కారించే చిత్రం లాంటి మరెన్నో చిత్రాలు ఇందుకు ఉదాహరణ.
అయితే ఈ సంస్కృతి ఇతర భాషా చిత్రాల కన్నా కూడా హిందీలో ఎక్కువగా కనిపిస్తుంది. పైగా క్రీడాకారుల జీవిత కథలకు బాలీవుడ్లో గిరాకీ ఎక్కువ. అందుకే మేరీకోమ్, ఎం.ఎస్.ధోని ది అన్ టోల్డ్ స్టోరీ లు భారీ విజయాలు సాధించగా ఆమిర్ నటించిన దంగల్ అతి పెద్ద గ్రోస్సెర్ కానుంది అని అంచానాలు నెలకొన్నాయి. ఇదే తరహాలో తెలుగు రాష్టానికి చెందిన శ్రీకాకుళం మహిళ కరణం మల్లీశ్వరి జీవిత కథను తెరకెక్కించటానికి ఆవిడ జీవితంలోని అనేక మలుపులను పూర్తిగా పరిశీలనా చేసుకుని మల్లీశ్వరి అనుమతితో స్క్రిప్ట్ తయారు చేశారు రచయిత సంజనా రెడ్డి. 2000 లో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో భారతకు వచ్చిన ఏకైక పతకం సాధించింది కరణం మల్లీశ్వరి మాత్రమే. మన దేశ పరువు నిలబెట్టిన అనేక విజయాలు సాధించింది మల్లీశ్వరి. అటువంటి గొప్ప క్రీడాకారిణి పాత్రలో సోనాక్షి సిన్హా నటించనుంది. సంజనా రెడ్డి రచించిన స్క్రిప్ట్ బాలీవుడ్ లో తెరకెక్కుతుండటం విశేషం. మరి ఇది బైలింగ్వల్ గా తీయనున్నారా? లేక తెలుగులోకి అనువదిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

