పెళ్లి చూపులు కమెడియన్ పెళ్లికొడుకయ్యాడు

నా చావు నేను చస్తా... నీకెందుకు అంటూ 'పెళ్లిచూపులు’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయిన ప్రియదర్శి ఆ తరువాత మహేష్ బాబు వంటి స్టార్ హీరోకి ఫ్రెండ్ గా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ 'స్పైడర్' లో మహేష్ ఫ్రెండ్ గా ప్రియదర్శి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అటు తర్వాత కూడా ప్రియదర్శి అనేక సినిమాల్లో నటించాడు... కానీ పెద్దగా అంటే 'పెళ్లి చూపులు' సినిమాలో వచ్చిన పేరు మాత్రం రాలేదు. కానీ ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ప్రియదర్శి ఉన్న కాసేపు కామెడీ బాగానే పండించాడు. తర్వాత కూడా ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘తొలిప్రేమ’ చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలో ఆకట్టుకున్నాడు.
వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి తాజాగా పెళ్లి కొడుకయ్యాడు. తాను ప్రేమించిన రిచాను, ప్రియదర్శి ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లోని ప్రముఖులను పెళ్ళికి ఆహ్వానించకపోయినా... రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించాడు. ప్రియదర్శి - రిచాలా రిసెప్షన్ నిన్న సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా విందుకు సినీ పరిశ్రమలోని నటీనటులు, అలాగే ప్రియదర్శి సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ నెలలోనే తన ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్న ప్రియదర్శి ఆ తరువాత కొద్దీ రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం మాత్రం విశేషం.




