పూరి చేసిన పని త్రివిక్రమ్ చేయటం లేదు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాదాపుగా స్టార్ హీరోస్ అందరితో సినిమాలు చేసి, చేసిన ప్రతి హీరోకి తనదైన చేంజ్ ఓవర్ పాత్రలు ఇచ్చి ప్రతి హీరో అభిమానులకి తానే అభిమాన దర్శకుడయ్యాడు. అంత క్రెడిబిలిటీ వున్న పూరి జగన్నాథ్, జ్యోతి లక్ష్మి, లోఫర్ వంటి చిత్రాలతో ఘోర పరాజయాలని చవి చూసిన సందర్భములో ఆయన తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మారుస్తూ వున్న వారిని తీసేసి కొత్త బృందాన్ని తీసుకుని ఇజమ్, రోగ్, పైసా వసూల్ చిత్రాలు చేశారు. కాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మార్చిన అనంతరం కూడా పూరికి ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు అనుకోండి.
రచయిత నుంచి దర్శకుడిగా మారిన నాటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎప్పుడు మార్చలేదు. అయితే ఈ ఏడాది విడుదలైన తొలి భారీ బడ్జెట్ చిత్రం ఆయన దర్శకత్వంలో వచ్చిన అజ్ఞ్యాతవాసి చిత్రమే. ఆ చిత్ర ఘోర పరాజయం పొందటంతో తారక్ తో చేయబోయే తదుపరి చిత్రం కోసమై త్రివిక్రమ్ దర్శకత్వ శాఖ లో మార్పులు చోటుచేసుకోనున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ వ్యక్తిగత స్టాఫ్ నుంచి అందిన సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదట. తారక్ చిత్రానికి కూడా తన పాత బృందంతోనే కొనసాగనున్నాడట త్రివిక్రమ్. ఎన్నో హిట్ చిత్రాలకి తన తలలో నాలుకై వున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని ఒక వైఫల్యం తో దూరం చేసుకోకుండా త్రివిక్రమ్ తన హుందా తనం కాపాడుకున్నాడని ఆయన సహచరులు గర్వం గా చెప్తున్నారు.

