పాపం పూరికి కూడా ఎదురు చూపులు తప్పటం లేదు

అగ్ర స్థాయి తారల చిత్రాలు నాణ్యతతో నిర్మితమవుతూ, అతి తక్కువ కాలంలో, మితి మీరని వ్యయంతో తెరకెక్కాయంటే ఆ చిత్రాల దర్శకుడు కచ్చితంగా పూరి జగన్నాథ్ ఐయి ఉంటాడు అని ప్రేక్షకులకు గట్టి నమ్మకం. కారణం ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి కథానాయకులతో సైతం చెప్పిన సమయానికి చిత్రీకరణ పూర్తి చేసి, చిత్రం విడుదల చేసి విజయాలు చూసిన దర్శకుడు. మహేష్ బాబుకి ఒక ఇండస్ట్రీ హిట్, మరో సూపర్ హిట్ ఇచ్చి ముచ్చటగా మూడవ చిత్రం మహేష్ తో చెయ్యటానికి కథ చెప్పి ఒప్పించుకుని కూడా కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.
పోకిరి, బిజినెస్ మం వంటి రెండు సూపర్ హిట్స్ తరువాత వారి కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు. పూరి కూడా ఒక కథ మహేష్‌కి చెప్పి, ఆయన ఒప్పుకోవటంతో జనగణమన అనే చిత్రం పోస్టర్ కూడా సామాజిక మాంద్యంలో ప్రచారానికి తెచ్చాడు. కానీ ఎంత కాలానికి ఆ చిత్రం కార్య రూపం దాల్చకపోవటంతో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో పూరీని ఈ విషయమై అడగగా, "మహేష్ కథ నచ్చింది అని చెప్పారు. కాబట్టి ఆయన ఎప్పుడు పిలిచి సినిమా చెయ్యమంటే అప్పుడు చెయ్యటానికి నేను సిద్దమే. ఆయన పిలుపు కోసమే ఎదురు చూస్తూ వున్నా." అని చెప్పాడు పూరి.
ప్రస్తుతం మురగదాస్ చిత్రం చేస్తున్న మహేష్, తదుపరి చిత్రాలుగా కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లను లైన్లో పెట్టాడు. ఆ వరుస లో పూరి పేరు లేకపోవటానికి కారణం ఈ మధ్య పూరి చిత్రాలు ఏవి కుటుంబ ప్రేక్షకులకు చేరువ కాకపోవటమే అని వినికిడి. కొరటాల, త్రివిక్రమ్ చెప్పే కథలు అయితే అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతుంటారు కాబట్టి ముందు వారికి అవకాశం ఇచ్చి ఉంటాడు మహేష్.

