పవర్ స్టార్ వైఖరి సినిమా ప్రచారంలో భాగమేనా?

దక్షిణాది కథానాయకుల చిత్రాలు ఓవర్ సీస్ విడుదలలు రాను రాను బాగా రిస్క్ వ్యవహారంగా మారిపోతుంది. మార్కెట్ వేల్యూ కంటే అధిక మొత్తంలో విడుదల హక్కులని విక్రయిస్తుండటమే ఇందుకు కారణం. అయితే విదేశాలలో మన చిత్రాలకి ఆదరణ బాగుండటంతో ఈ ప్రక్రియ ఒక్కో చిత్రానికి మరీ ప్రియం గా మారిపోతుంది. అధిక మొత్తాలకు విక్రయించిన చిత్రాలకి ప్రొమోషన్స్ సరిలేకపోతే లెక్కలు తారుమారు అయ్యే పరిస్థితి ఎదురు అవుతుంది. ఒక్క రజనీకాంత్ చిత్రాలకి మాత్రమే ఎలాంటి ప్రమోషన్ లేకుండా చిత్రాన్ని విడుదల చేయటానికి పంపిణీదారులు సాహసిస్తున్నారు. అందుకే ధ్రువ చిత్రానికి చరణ్, డిజె చిత్రానికి బన్నీ, హలో చిత్రానికి అఖిల్ ప్రొమోషన్స్ లో అధిక సమయం విదేశీ మార్కెట్ పై దృష్టి సారించారు.
పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞ్యాతవాసి చిత్ర ఓవర్సీస్ విడుదల హక్కులు 25 కోట్ల రూపాయల మొత్తానికి విక్రయించారు నిర్మాత రాధా కృష్ణ. బాగా ఆడుతున్న స్టార్ హీరో చిత్రానికి కూడా ఈ మొత్తం వసూళ్లు కావటం అసంభవం. కానీ పంపిణీదారులలో విశ్వాసం నింపాలంటే హీరో ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనాలి. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి కార్యక్రమాలు ఏవి తలపెట్టలేదు. కానీ అకస్మాత్తుగా ఎన్నడూ లేనిదీ అమెరికా దేశంలో ప్రవాస ఆంధ్రులని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి విదితమే. ఇంతకాలం లేని ప్రేమ విదేశాలలో వున్నా తెలుగు వారి ఇప్పుడు కలగటాన్ని కొందరు విమర్శకులు పబ్లిసిటి ట్రిక్ గా పరిగణిస్తున్నారు. మరి పవర్ స్టార్ ఏ ఉద్దేశంతో ఆ వీడియో విడుదల చేశారో కానీ అది ఈ రకంగా అయినా పంపిణీదారులకి, కొనుగోలుదారులకు లబ్ది చేకూరిస్తే మంచిదేగా...

