పవన్‌తో ఇంకా ఓకే కాలేదు అంటున్న కోన!

నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తొలి ప్రయత్నాల్లోనే నష్టాలు చూసి రచయితగా మారారు కోన వెంకట్. ఆయన అనేక విజయవంతమైన చిత్రాలకు కథ, కథనం, సంభాషణలు సమకూర్చారు. శ్రీను వైట్ల తో కోన సినీ ప్రయాణం సుదీర్ఘ కాలం సాగింది. వీరి కలయికలో ఎదుగుతున్న హీరోల దగ్గర నుంచి అగ్ర హీరోల వరకు అందరికి విజయాలు అందాయి. కొంత కాలం క్రితం మనస్పర్థల కారణంగా వీరు విడిపోయిన తరువాత అటు శ్రీని వైట్లకు, ఇటు కోన వెంకట్ ఇద్దరికీ సక్సెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.
ఈ పరియాయంలోనే మరొక సారి రచనతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుని శంకరాభరణం చిత్రంతో దెబ్బ తిన్నాడు కోన వెంకట్. ఇక తన కథలను తానే తెరకెక్కించుకోవాలనే నిర్ణయం ఏనాడో వెలిబుచ్చాడు. కానీ అప్పటికే రచయితగా కుదుర్చుకున్న ఒప్పందాలు పూర్తి కాకపోవటంతో ఇప్పటికీ దర్శకుడు కాలేకపోయాడు. అయితే కోన తన తొలి దర్శకత్వ ప్రయత్నం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ద్వారా చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు విస్తృతంగా వినిపించాయి. కోనకి పవర్ స్టార్ తో వున్న అనుబంధం వల్ల ఈ వార్తకు మరింత బలం ఏర్పడింది.
ఇంత కాలానికి ఈ వార్త పై స్పందించిన కోన వెంకట్, "నేను దర్శకత్వం చెయ్యాలనే ఆలోచనలో వున్న విషయం పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్న విషయం వాస్తవమే. ఆయన సరైన కథ తెస్తే స్వయంగా తానే అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చారు. కానీ మా మధ్య ఇప్పటి వరకు ఎటువంటి కథా చర్చలు జరగలేదు. భవిష్యత్తులో పవర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తానేమో కానీ ఇప్పటికి అయితే మా మధ్య కమిట్మెంట్ ఏది జరగలేదు." అని తెలిపారు.

