పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

ప్రభాస్, అనుష్క మధ్య ఎదో ఉందని, వారిద్దరూ వివాహం చేసుకుంటారని మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని వారిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. అయినా అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ మాత్రం పడడంలేదు. ప్రభాస్ కు అనుష్క అంటే విపరీతమైన ఇష్టమని... అలాగే అనుష్కకు కూడా ప్రభాస్ అంటే ప్రాణమని సన్నిహితులు చెప్పుకుంటారు. అనుష్కను వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ ఎన్ని సంబంధాలు వస్తున్నా ఒప్పుకోవడం లేదని, ప్రభాస్ ఇంట్లోనూ, చుట్టాల్లో కూడా అనుష్క అంటే ఇష్టపడడం లేదని, అందుకే జాప్యం జరుగుతోందని అంటారు.
అనుష్క కూడా వివాహం చేసుకోకుండా ప్రభాస్ కోసం చెకోర పక్షిలాగా ఎదురు చూస్తోందని అంటారు. ప్రభాస్ తో పాటు బిల్లా, మిర్చి చిత్రాల్లో కలిసి నటించిన అనుష్క ఆ సినిమా షూటింగుల సమయంలోనే అతనితో ప్రేమలో పడిందని అంటారు. ఇక బాహుబలి ఒకటి, రెండు చిత్రాల నిర్మాణం నాలుగు సంవత్సరాలకు పైగా సాగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న కాస్త దూరం కూడా చెరిగిపోయిందని అంటారు.
ఈ మధ్య ప్రభాస్ సాహో చిత్రం షూటింగు విశేషాల గురించి మాట్లాడుతూ ఈ చిత్రం తరువాత తాను హిందీ చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇదే సందర్భంలో అనుష్క గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించి ఏమీ లేదంటూ సమాధానం దాటవేశారు. అయితే అనుష్క పేరు ఎత్తగానే ప్రభాస్ ముఖంలో చిరునవ్వు కన్పించింది. ఆ ఇద్దరి మధ్య ఏమీ లేదని చెబుతూనే ఈ చిరునవ్వు ద్వారా ఏదో ఉందని పరోక్షంగా తెలిపాడు.

