నోటు కష్టాలున్నా సినిమాలు హిట్ కొట్టాయి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య సినిమా పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని విశ్లేషకులు వేసిన అంచనా నిజం ఐయ్యింది. అనేక చిత్రాలు విడుదలలు వాయిదా వేసుకోగా, చిత్రీకరణ దశలో వున్న మరికొన్ని చిత్రాలు నిలిచిపోయాయి. ఫైనాన్సియర్ల నుంచి అప్పుగా తెచ్చిన నల్ల ధనంతో నిర్మితమవుతున్న చిత్రాలకు ఈ గడ్డు పరిస్థితి ఎదురు ఐయ్యింది. సామాన్య ప్రజల దగ్గరా అవసరాలకు సరిపోయినంత కరెన్సీ అందుబాటులో లేని స్థితి ఏర్పడింది. ఇంతటి ఆర్ధిక సంక్షోభంలోనూ ధైర్యం చేసి సినిమాలు విడుదల చేసిన నిర్మాతలు కూడా వున్నారు.
గత వారం విడుదల అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి ఆర్ధిక సంక్షోభంలోనూ తెలుగు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. ఈ శుక్రవారం విడుదల అయిన దేశవాళీ వినోదంతో నిండిన జయమ్ము నిశ్చయమ్ము చిత్రం కూడా తొలి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్సుతో ప్రదర్శించబడుతూ అంచనాలు అందుకుంటుంది. ప్రేక్షకుల పై భారం వేసి చిత్రాలు విడుదల చేసిన నిర్మాతలకు ప్రేక్షకులు ఇస్తున్న తీర్పు ఆనందదాయకంగా మారింది. ఎన్ని ఇబ్బందులు, ఆర్ధిక అవకతవకలతో జీవితం నడుస్తున్నా మంచి చిత్రం మరుగునపడకుండా దీవిస్తాము అని తెలుగు సినీ ప్రేక్షకులు మరొకసారి రుజువు చేశారు.

