దెబ్బ పెద్ద సినిమాలకా? చిన్న సినిమాలకా?
పెద్దనోట్ల రద్దు; లేదా నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకున్న తాజా చర్యలు; తత్పర్యవసానంగా ఆర్థిక లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఇవన్నీ దాదాపుగా అన్ని రకాల వ్యాపార రంగాల మీద సమానంగా ప్రభావం చూపించిన సంగతి కనిపిస్తూనే ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదే రకంగా సినిమా పరిశ్రమ కూడా కొన్ని కుదుపులకు లోనవుతోంది. షూటింగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా థియేటర్లలో జనం తగ్గిపోతున్నారు. నలుగురైదుగురు ప్రేక్షకుల కోసమే సినిమా వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే.. ఈ నోట్ల రద్దు లేదా, నల్లధనం నియంత్రణ నిర్ణయాల వలన చిన్న సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులకు గురవుతున్నదంటూ చాలా మంది పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాలు నిర్మాణంలో ఆగిపోతున్నాయని, చిన్న నిర్మాతలు దెబ్బతింటున్నారని అంటున్నారు. సినిమా రంగానికి పన్ను మినహాయింపులు ఇస్తే తప్ప ఆ రంగం కోలుకోదంటూ కొత్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి మాయాపూరితమైన ప్రచారం ద్వారా అనుచితమైన లబ్ధి పొండానికి ప్రయత్నిస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.
అయినా నోట్ల రద్దు నల్లధనం కట్టడి ప్రయత్నాల వలన నష్టపోయేది పెద్దసినిమాలా? చిన్న సినిమాలా? అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది. కాకుల పేరు చెప్పుకుని గద్దలు లాభపడాలని చూస్తున్నాయనేది పలువురి విమర్శ. నిజానికి చిన్న సినిమాల బడ్జెట్ కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. వీరు ఇచ్చే రెమ్యునరేషన్లు, పెట్టే ఖర్చులు అన్నీ కంపేరిటివ్ గా చిన్నవిగానే ఉంటాయి. ఆ మొత్తాలని వీరు వైట్ మనీలో చెల్లించే అవకాశాలే ఎక్కువ. అదే పెద్ద చిత్రాల ప్రొడక్షన్ విషయాలకు వస్తే.. ఒక్క హీరోకే పదినుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్లు ఇస్తున్నారంటే.. అందులో బ్లాక్ మనీ ఎంత, వైట్ మనీ ఎంత ఉంటుందో ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. అలా హీరోలు, హీరోయిన్లు, దర్శకులకు భారీ మొత్తాల్లో బ్లాక్ మనీని చెల్లిస్తున్నది పెద్ద సినిమాలు మాత్రమే. ఇలా నల్లధనం కట్టడి వల్ల.. పెద్దసినిమాల తోక కత్తిరించినట్లు అవుతుంది. నల్లధనం రెమ్యునరేషన్లు అదుపులోకి వచ్చి పరిశ్రమ స్థిరంగా వర్ధిల్లే అవకాశం ఉంటుంది. అయితే.. సహేతుకంగా వివరించకుండా.. ఈ నిర్ణయాల వల్ల చిన్న సినిమా దెబ్బతింటున్నదంటూ.. పెద్ద నిర్మాతలు ఓ ప్రచారాన్ని ప్రారంభించి.. మొత్తం పరిశ్రమకు రాయితీలు, మినహాయింపులు పొందే కుట్రల్లో ఉన్నారు.
ఇలాంటి కుట్రల విషయంలో ప్రభుత్వం వివేచనతో వ్యవహరించాలి. తాము నష్టపోతున్నాం రాయితీలు ఇవ్వండి అంటూ వచ్చే వ్యాపార పరిశ్రమలు ఏవి ఉన్నా సరే.. అసలు వారు వ్యాపార లావాదేవీలకు సంబంధించి చూపిస్తున్న లెక్కల వివరాలను కఠినతరం చేసి, తప్పుడు పోకడలకు చెక్ పెట్టాలని పలువురు కోరుకుంటున్నారు.