దిల్ రాజు తట్టుకుంటాడా?

గతంలో దర్శకుడు శంకర్ - నటుడు కమల్ హాసన్ కలయికలో భారతీయుడు అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చిన చాలా ఏళ్ళకి ఇప్పుడు వీరి కలయికలో మరో సినిమా తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటినుండో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా శంకర్ - కమల్ కలయికలో రాబోయే సినిమాకి దిల్ రాజు నిర్మాత అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇన్నేళ్లకు కమల్ - శంకర్ కలయికలో సినిమా అంటేనే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం వీళ్లిద్దర్నీ పెట్టి దిల్ రాజు సినిమా చేయడం అంటున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న రూమర్ల ప్రకారం.. కమల్ - శంకర్ కలయికలో తెరకెక్కబోయే సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడని న్యూస్ ఫిలింనగర్ స్కిల్స్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అదికూడా కేవలం తెలుగు వెర్షన్ వరకు మాత్రమే కాదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను దిల్ రాజే తీస్తాడట. మరి నిజంగా ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తే గనక... దిల్ రాజుకు ఇది మొదటి తమిళ సినిమా అన్నమాట. దర్శకుడు శంకర్, హీరో కమల్ కి మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లుగా... భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్స్ లో ఉన్నారు వీళ్లు అని చెబుతున్నారు.
మరి ఇదంతా ఒక ఎత్తైతే కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న వేళ.. భారతీయుడు 2 రావడం అతడి రాజకీయ రంగప్రవేశానికి మంచి పునాదిగా చెప్పవచ్చు అంటూ జోరుగా కథనాలు కోలీవుడ్ మీడియాలో వెలువడుతున్నాయి. కాకపోతే.. కమల్, శంకర్ లాంటి భారీ బడ్జెట్ మేకర్స్ ను ఆచి తూచి అడుగులు వేసే నిర్మాత దిల్ రాజు తట్టుకోగలడా అనేదే ఇక్కడ తలెత్తే ప్రశ్న.

