తెలుగు సినిమాల విడుదలలో తప్పని జాప్యం

హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను చూసి మన ఫిలిం మేకర్స్ బాగా ప్రభావితం అవుతుంటారు. హాలీవుడ్ చిత్రాలలో సన్నివేశాలను మన కథల్లోకి అన్వయిస్తుంటారు. బాలీవుడ్ వారు చిత్రీకరణలు జరిపే ప్రదేశాల్లో మన చిత్రీకరణలు జరపటం, హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ చేయటం, బాలీవుడ్ నటులను తెలుగు చిత్రాలకు తీసుకురావటం ఇలా ప్రతి విషయంలోనూ బాలీవుడ్, హాలీవుడ్ లను స్ఫూర్తిగా తీసుకునే మన వారు విడుదల ప్రణాళికల్లో మాత్రం ఎవరి పంథా వారిదే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు ప్రకటించిన నాటికే వాటి విడుదల తేదీ ఖరారు అయిపోతుంది. థియేటర్ల సర్దుబాటు విషయంలో ఇతర చిత్రాలతో ఇబ్బంది ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి ఈ పద్ధతి చాలా దోహద పడుతుంటుంది.
ప్రస్తుతం తెలుగు చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి వాయిదాలు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చర్య కొంత మేర నిర్మాతల వ్యూహాలను తలకిందులు చేయగా, పెద్ద చిత్రాల వాయిదాలు చిన్న చిత్రాల విడుదలలపై ప్రభావితం చూపుతుంది. ధ్రువ చిత్రం తొలుత ప్రకటించిన రెండవ తేదీ నుంచి 9 వ తేదికి వాయిదా పడటంతో దాని ప్రభావం కనీసం రెండు వారాలు ఉంటుంది అని గ్రహించిన సూర్య తన ఎస్ 3 చిత్రాన్ని 16 నుంచి 23 కి వాయిదా వేయటం జరిగింది. అసలే సింగం తొలి రెండు భాగాలు తెలుగులోనూ బాగా ఆడటంతో ఎస్ 3 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీనితో ముందుగా 23 వ తేదీ విడుదలకి ప్లాన్ చేసిన నేను లోకల్ చిత్రం ఇప్పుడు వాయిదాకి గురి అయ్యింది. కొత్త విడుదల ఇంకా ప్రకటించలేదు నిర్మాతలు. క్రిస్టమస్ దాటితే జనవరి నెలలో థియేటర్లు దొరకని పరిస్థితి. చిరు, బాలయ్యల ప్రతిష్టాత్మక చిత్రాలకు ఇప్పటికే సంక్రాంతి పండుగ నుంచి రెండు వారాలు థియేటర్లు బ్లాక్ అయిపోయాయి.
డిసెంబర్ లో విడుదల కావాల్సిన నేను లోకల్, ఆక్సిజన్, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి పలు చిత్రాలకు ఇదే పరిస్థితి ఎదురు అవుతుండటం విచారకరం. ఇప్పటికైనా పెద్ద చిత్ర నిర్మాతలు వారి చిత్ర విడుదలను మూడు నెలల ముందుగా ఖరారు చేసి వాయిదా వేయకుండా విడుదల చేస్తే దాని బట్టి చిన్న చిత్ర నిర్మాతలకు వారి విడుదలల ప్రణాళిక ప్రకారం థియేటర్లు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

