తెలంగాణ భాష సినిమాకి ఏపీలో పట్టంకట్టారు

తెలంగాణ నేటివిటీతో.. తెలంగాణ భాషతో హీరోయిన్ సాయి పల్లవి చేసిన ఫిదా విడుదలై 50 రోజులు పూర్తయింది. ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై కోట్లు కొల్లగొట్టి నిర్మాతకు భారీ లాభాలు సమకూర్చి పెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. అభిరుచిగల నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల నోళ్ళలో నానుతుంది అంటే ఆ సినిమా సాధించిన విజయమే అనిచెప్పాలి.
ఇక స్టార్ హీరోల సినిమాల్తో పోటీగా ఈ చిత్రం ఇప్పుడు రేర్ ఫీట్ సాధించింది. అదేమిటంటే ఫిదా విడుదలైన రెండు థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు రెండు థియేటర్స్ లో 2 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ సాధించింది. అలాగే వైజాగ్‌లో సూపర్ ఫేమస్ అయిన జగదాంబ థియేటర్లోనూ కోటి రూపాయల గ్రాస్ సాధించినట్లు ఫిదా 50 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం పోస్టర్స్ వేయించింది. ఆపోస్టర్స్ లోనే రెండు థియేటర్స్ లో రెండు కోట్ల గ్రాస్ సాధించినట్లుగా ప్రచురించారు.
మరి హైదరాబాద్ లో తెలంగాణ యాసతో తెరక్కేక్కిన సినిమాకి జనాలు నీరాజనాలు పట్టారంటే ఓకేగాని.... ఏపీలో కూడా తెలంగాణ యాసకి అంత గొప్పగా ప్రేక్షకాదరణ లభించింది అంటే మామూలు విషయం కాదు. ఏపీలోని వైజాగ్ లో జగదాంబ థియేటర్లో కోటి కొల్లగొట్టడం చూస్తుంటే మాత్రం అదరహో అనిపించకమానదు. ఇక ఫిదా చిత్ర దాదాపు 86 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని చిన్న సినిమాకి ఎంత పవర్ ఉందొ నిరూపించింది.

