తమ్ముడు పిలిస్తే వెళ్ళిపోతాడంట

అన్నగారు చిరంజీవి మెగాస్టార్, మరి తమ్ముడు పవనేమో పవర్ స్టార్.. కానీ మధ్యన ఉన్న నాగ బాబు ఏ స్టారు కాదు. ఎందుకంటే నాగబాబు అటు చిరులా సినిమాల్లో టాప్ పొజిషన్ కి వెళ్లలేకపోయాడు. ఇటు తమ్ముడిలా కూడా ఎటువంటి క్రేజ్ సంపాదించలేకపోయాడు. అలాగే అన్న కొడుకు రామ్ చరణ్ ని హీరోగా పెట్టి తీసిన 'ఆరెంజ్' సినిమా ప్లాప్ తో ఆర్ధికంగానూ కుదేలైపోయాడు. అయితే ఆమధ్యన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో ప్రముఖ పాత్ర పోషించి కాస్త నిలదొక్కుకుందామనుకున్నాడు. కానీ ఆపార్టీ ప్రజల్లో ఈదలేక మూతపడింది. పాపం నాగ బాబు మళ్ళీ మొదటికే వచ్చేసాడు. ఏదో జబర్దస్త్ అంటూ కామెడీ షోకి జడ్జ్ గా చేస్తూ కాలం నెట్టుకొస్తూనే ఇప్పుడు ఆలు అర్జున్ 'నా పేరు సూర్య'ని సమర్పిస్తున్నారు.
అయితే నాగబాబు కొద్దీ రోజులుగా పవన్ జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. అన్నీ చెబుతున్న నాగబాబు మాత్రం జనసేనలోకి రావడంలేదు. అయితే ఇప్పుడు తమ్ముడు పవన్ పిలిస్తే జనసేనలోకి రావడానికి అభ్యంతరం లేదని ప్రకటించాడు. అసలు తన తమ్ముడు తనని జనసేనలోకి పిలవకుండా ఉండడానికి గల కారణాలు కూడా చెబుతున్నాడు. నేను నా జీవితంలోపడిన కష్టాలు కళ్యాణ్ కి తెలుసనీ...ఇకపై తాను మళ్ళీ అలాంటి కష్టాలు పడడం తన తమ్ముడికి నచ్చకే... పవన్ తనని జనసేనలోకి పిలవలేదని చెబుతున్నాడు. ‘ఆరెంజ్’ సినిమా అపుడు అప్పుల్లో ఉన్న నన్ను పవన్ ఆదుకున్నాడు... అలాగే ఇప్పుడు తాను జనసేనలోకి వెళ్ళాక అది పవన్ కి ప్లస్ కాకపోయినా పర్వాలేదు గాని.. మైనస్ కాకూడదనే ఆలోచనతోనే తానూ ఉన్నట్లు చెబుతున్నాడు.
తనకి ఎటువంటి పదవులు అక్కర్లేదని.... పవన్ గనక పిలిచి జనసేనకు నీ అవసరం ఉందని చెబితే ఓ కార్యకర్తలా పని చేస్తానని చెబుతున్నాడు. మరి పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టమని కూడా చెబుతున్నాడు నాగబాబు. మరి పవన్, నాగబాబు మాటలని పట్టించుకుంటాడా... లేదో చూద్దాం.

