తనకి మంచి మిత్రుడు మాత్రమే అంటున్న పవన్

పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి చక్కటి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎంతో క్లారిటీగా ప్రజాసమస్యలపై గళమెత్తుతున్నాడు. అయితే పవన్ మాటల్లో అంత స్పష్టత ఉండడానికి వెనుక మరొకరున్నారని.. అది కూడా పవన్ నీడ దర్శకుడు త్రివిక్రమ్ అనే ప్రచారం బాగా వుంది. అయితే పవన్ కి సలహాదారుగా త్రివిక్రమ్ అనే టైటిల్ కి పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం నోవెటల్ లో జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అతిరధ మహారథుల మధ్యన జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో పవన్ కి త్రివిక్రమ్ మీద ఎంత గౌరవం ఉందొ ఫాన్స్ సాక్షిగా గా చాటుకున్నాడు.
తన వెనుక త్రివిక్రమ్ ఉన్నాడనే మాట వాస్తవం కాదంటూనే.. త్రివిక్రమ్ తనకి సలహాలు ఇస్తుంటాడని చాలా చాలా రకాలుగా చాలామంది భావిస్తారు.. అలాంటి సమయంలో నాకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే తనని చాలామంది ఒంటరి వాణ్ణి చేసినప్పుడు, అలాగే డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఒక ఆప్తుడిలా ఆదుకున్నాడని... ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పి త్రివిక్రమ్ నాకో పుస్తం ఇచ్చాడని... అలాగే డిప్రెషన్ లోనుండి బయటికి రావడానికి మంచి కవితలు వినిపించేవాడిని... త్రివిక్రమ్ నాకు అపజయాలు వచ్చినప్పుడు వెన్నంటి ఉండి ధైర్యం చెప్పాడని... చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా నేను స్వతహాగా రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా కోప్పడలేని నేను త్రివిక్రమ్ ని కోప్పడగలనని.. ఎందుకంటే ఆయనతో నాకంత చనువుందని.. త్రివిక్రమ్ తనకి మంచి మిత్రుడని చెప్పాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ కి హీరోగా తాను కాకపోతే బోలెడుమంది హీరోలున్నారని... ఇండస్ట్రీలో తానొక్కడే హీరో కాదని.. అలాంటి త్రివిక్రమ్ కి నేను లైఫ్ ఇవ్వడం అనేది హాస్యాస్పదమని చెప్పాడు.

