జయసింహకే ఫిక్స్ అవుతాడా..?

బాలకృష్ణ యమా జోరుగా సినిమాలు లైన్ లో పెట్టడమే కాదు అంతే స్పీడుగా సినిమాలు సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోతున్నాడు. మొన్నటికి మొన్న పూరితో సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లి అందరికి షాక్ ఇచ్చిన బాలయ్య ఇంకా ఈ సినిమా కంప్లీట్ కాకుండానే కె. ఎస్ రవికుమార్ డైరెక్షన్లో తన 102 వ సినిమాని లైన్లో పెట్టేసాడు. పూరి తో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రం ఈ దసరాకి దిగిపోతుండగా... రవికుమార్ చౌదరితో తీసే చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో పట్టాలెక్కించే దిశగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు.
సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న బాలకృష్ణ 102 వ చిత్రంలో నయనతార ని హీరోయిన్ గా ఫైనల్ చేస్తున్నారనే టాక్ వినబడుతుండగా... టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్ర చేయబోతున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఉండబోతుంది. మరి రాయలసీమ ఫ్యాక్షన్ అంటే ఈ చిత్రానికి టైటిల్ కూడా అలానే పవర్ ఫుల్ గా 'రెడ్డి గారు' అయితే బాగా సెట్ అవుతుందని ప్రచారం జరిగింది. దాదాపు ఈ 'రెడ్డి గారు' టైటిల్ ఫిక్స్ అవుతుందన్న తరుణంలో మరో టైటిల్ తెరమీదకొచ్చింది.
ఇప్పుడు బాలకృష్ణ 102 వ చిత్రానికి టైటిల్ 'జయ సింహ' అయితే బావుంటుందని...దీనిని చిత్ర యూనిట్ తో పాటే బాలకృష్ణ కూడా ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రెడ్డి అనే పదం వాడితే రాజకీయంగా ఎమన్నా ప్రోబ్లెంస్ రావచ్చనే కారణంతోనే ఇప్పుడు బాలకృష్ణ టైటిల్ ని మర్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. దాదాపుగా బాలకృష్ణ చిత్రానికి 'జయసింహ' టైటిల్ ఫిక్స్ అవ్వచ్చని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

