జతగా కి ముహూర్తం కుదిరేది ఎన్నడు?

తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర ప్రేక్షకులది విశాల హృదయం అని పనికట్టుకుని చెప్పే అవసరం ఏ మాత్రం ఉండదు. కారణం పర భాష నటీనటులు, సాంకేతిక నిపుణులు వారి వారి భాషల్లో చిత్రాలకు సమానంగా, కొందరు అయితే తెలుగు లోనే ఎక్కువ చిత్ర అవకాశాలు పొందుడుండటం. నటీనటులు, సాంకేతిక నిపుణులే కాక పర భాష చిత్రాలు కూడా మన చిత్రాల వ్యాపారంతో పోటాపోటీ గా దిగుతుండటం చూస్తుంటే ఎవరికైనా తెలుగు ప్రేక్షకుల ఆధారణా గుణం యిట్టె అర్ధం అయిపోతుంది. ఏదో పుణ్యానికి పర భాష నటుల ఒక చిత్రం ఆడితే, ఆ నటుల ప్రతి చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తుంటారు నిర్మాతలు.
ఆలా మనకు 2015 లో పరిచయం ఐన మలయాళ నటుడు దుల్కర్ సాల్మన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు. ఆయన ప్రముఖ దర్శకుడు మని రత్నం దర్శకత్వంలో నిత్య మీనన్ తో నటించిన ప్రేమ కావ్యం ఓకే బంగారం మన ప్రేక్షకుల నుంచి అమిత ఆదరణ పొందింది. తర్వాత అదే జంట మలయాళంలో నటించిన 100 డేస్ ఆఫ్ లవ్ చిత్రాన్ని కూడా అనువదించి విడుదల చెయ్యగా ఆ చిత్రం ఇక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది. నాటి నుంచీ దుల్కర్ నిత్యల ఉస్తాద్ హోటల్ అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యటానికి అనువాద కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి జతగా అనే పేరుతో ప్రచారం కూడా చేసారు. కానీ ప్రకటించిన అనేక విడుదల తేదీలను వాయిదాలతో దాట వేసి ఇంకా ప్రేక్షకులను అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూనే ఉంది. మరి ఈ చిత్రానికి సరైన విడుదఝల ముహూర్తం ఎప్పటికి కుదురుతుందో...
మలయాళంలో ఘన విజయం సాధించిన ఉస్తాద్ హోటల్ చిత్ర కథ పెద్ద ఆశయాలు సాధించే దిశగా ఆలోచించే మనుమడు, నమ్మకాన్ని నిలబెట్టే వ్యాపార సూత్రాలను తప్పకూడదు అని శ్రమించే తాత ల మధ్య నడిచే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది.

