ఖాన్ల అనుమతి తర్వాతే... చెర్రీకి సిక్స్ ప్యాక్

అల్లు అర్జున్, ప్రభాస్, నితిన్, సుధీర్ బాబు, కళ్యాణ్ రామ్, సునీల్, ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఇలా తెలుగు అగ్ర హీరోలు అందరూ ఆరు పలకల శరీరాకృతితో తెరపై దర్శనమిచ్చిన వారే. అయితే ఈ సిక్స్ ప్యాక్ ట్రెండ్ ని మన వాళ్లకు పరిచయం చేసింది మాత్రం బాలీవుడ్ కథానాయకులే. మన దగ్గరం కేవలం యువ హీరోలు ప్రయత్నించే శరీరాకృతి ఈ సిక్స్ ప్యాక్. కానీ బాలీవుడ్లో ఐదు పదుల వయసులో కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇటువంటి ఫిట్నెస్ తో కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం కోసం అయితే ఆయన శారీరకంగా పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. బరువు పెరగటం, కొద్ది కాలంలోనే మళ్లీ బరువు తగ్గటం అన్నీ ఫిజికల్ ట్రైనర్ రాకేష్ ఉడైయార్ పర్యవేక్షణలోనే జరిగాయి.
సుల్తాన్ చిత్రం తరువాత ట్యూబ్ లైట్ చిత్రానికి శరీరాకృతిని సిద్ధం చేస్తున్న సల్మాన్ ఖాన్ కూడా రాకేష్ ఉడైయార్ సూచనల మేరకే బరువు తగ్గటం చేస్తుంటాడు. ఈ ఇద్దరు ఖాన్ లకు ఫిజికల్ ట్రైనర్‌గా వున్న రాకేష్ ఉడైయార్ కు ధ్రువ పరిచయ గీతంలో రామ్ చరణ్ తేజ్ కనిపించే బాడీ ఫిట్నెస్ కోసం సలహాలు సూచనలకై ధ్రువ చిత్ర బృందం నుంచి పిలుపు రావటంతో ఆమిర్, సల్మాన్ ల దగ్గర అనుమతి తీసుకుని హైద్రాబాద్ వచ్చి చెర్రీ కి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చానని పేర్కొన్నాడు ఫిజికల్ ట్రైనర్ రాకేష్ ఉడైయార్. ఆయన పని తనం, చెర్రీ కష్టమే ఇటీవల విడుదల చేసిన సాంగ్ మేకింగ్ వీడియో లో కనపడుతుంది. కేవలం ఆ సాంగ్ లో చెర్రీ లుక్ కోసం ఫిజికల్ ట్రైనీ గా రాకేష్ ఉడైయార్ పని చేసినప్పటికీ, చెర్రీ పాటలోనే కాక చిత్రమంతా శారీరకంగా ఫిట్ గా కనపడబోతున్నాడు.

