క్రౌడ్ ఫండింగ్ దూకుడును ‘వశం’ డిసైడ్ చేస్తుందా?

సినిమా నిర్మాణంలో టెక్నాలజీ తెచ్చిన మార్పులు బడ్జెట్ ను బాగా దిగువకు తీసుకువచ్చేశాయి. అదే సమయంలో.. అనేక మంది కొత్త నిర్మాతలు కూడా నిర్మాణం వైపు చూడడానికి ధైర్యం చిక్కేలా చేశాయి. పైగా ఔత్సాహికులు నలుగురైదుగురు కొన్ని సందర్భాల్లో అంతకంటె ఎక్కువ మంది కూడా కలిసి.. ‘క్రౌడ్ ఫండింగ్’ పేరుతో తలా కొంచెం డబ్బులు మాత్రమే వేసుకుని సినిమాను నిర్మించడం అనే పోకడ ఇటీవలి కాలంలో వస్తోంది. నిజానికి చాలా తక్కువ మొత్తాల్లో స్నేహితులు కొందరు తలాకొంచెం పెడతారు. సినిమా హిట్టయితే అందరికీ లాభాలు వస్తాయి. ఫ్లాపయితే.. తలా పెట్టినదాంట్లో కొంచెం డబ్బులు పోతాయి.. ఎవ్వరూ పూర్తిగా మునిగిపోవడం ఉండదు. ఇలాంటి ఆలోచనతో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ కల్చర్ పెరగలేదు.
ఇప్పుడు మళ్లీ కొందరు ఐఐటీ, ఐఐఎం మాజీ విద్యార్థులు కలసి క్రౌడ్ ఫండింగ్ రూపేణా పెట్టుబడులు పెట్టి ఓ సినిమా తీస్తున్నారు. ఆ చిత్రమే వశం. థ్రిల్లర్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జయాపజయాలు చిన్న చిత్రాలకు చాలా కీలకం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే.. ఇది ఫ్లాప్ అయినా సరే.. ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్టు. అలాంటి నేపథ్యంలో ‘వశం’ ఏ మాత్రం పెట్టుబడులు సాధించే రేంజి హిట్ అయిందంటే.. క్రౌడ్ ఫండింగ్ రూపేణా వచ్చే చిత్రాల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. అయితే సినిమా వ్యాపారం చాలా గందరగోళం గనుక.. ఏమవుతుందో.. ఏమో అనే భయంతో దాని జోలికి వెళ్లకుండా ఎవరికి వారు మిన్నకుండిపోతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో నలుగురూ నాలుగు చేతులూ వేసి చేసే క్రౌడ్ ఫండింగ్ చిత్రాలకు ఊపిరిగా.. ఈ ‘వశం’ విజయం నిలుస్తుందని అంచనాలు సాగుతున్నాయి.

