కోతులు, మేకతో రానున్న డాషింగ్ డైరెక్టర్

ఇడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్ వంటి టైటిల్స్ పెట్టి స్టార్ కథానాయకులతో సినిమాలు చేసే ధైర్యం కేవలం దర్శకుడు పూరి జగన్నాథ్ కే వుంది. ఆయన టైటిల్స్ విషయంలో ఎప్పుడూ వినూత్నంగానే ఆలోచిస్తారు అనటానికి బుజ్జిగాడు, టెంపర్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి పేర్లు నిదర్శనం. ప్రతి ఏడాది మూడేసి చిత్రాలు తెరకెక్కించే ఏకైక దర్శకుడిగా కూడా పూరి జగన్నాథ్ కి ఈ తరం దర్శకులలో ఆర్.జి.వి. తరువాత ప్రత్యేక స్థానం వుంది. అయితే జ్యోతి లక్ష్మి, లోఫర్ చిత్రాలు నిరాశ పరిచిన తరువాత ఎంతో జాగ్రత్తగా కళ్యాణ్ రాంతో ఈ ఏడాది ఎక్కువ సమయం వెచ్చించి ఇజమ్ చిత్రం చేసినా పూరీకి మరోసారి చేదు అనుభవమే ఎదురు అయ్యింది.
ఇజమ్ విడుదల తరువాత తారక్ తో సినిమా చర్చల దశలో తిరస్కారానికి గురి కావటంతో పూరి కొంత విరామం తీసుకుని ఇప్పుడు ‘మూడు కోతులు ఒక మేక’ అనే టైటిల్ తో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ టైటిల్ ని బట్టి నాలుగు లీడ్ రోల్స్ చుట్టూ కథ తిరుగుతుంది అని అర్ధం అవుతుంది. అయితే ఈ టైటిల్ తో పూరి స్టార్స్ తో సినిమా చేయబోతున్నాడా లేక ఫ్రెష్ యాక్టర్స్ తో చేయబోతున్నాడా అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పూరి ఈ టైటిల్ తో అప్రోచ్ అయితే స్టార్ హీరోస్ నుంచి తిరస్కారమే ఎదురు అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి అనే అభిప్రాయాలూ వినపడుతున్నాయి. కాస్టింగ్ ఫైనల్ చేసుకుని పూరి తనంతట తాను ప్రకటిస్తే తప్ప మూడు కోతులు ఒక మేక పై పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదు.

