కృష్ణ గారిలా మహేష్ చేయకపోవటానికి కారణం....

సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ ట్రాక్ రికార్డ్స్ ఒక్కసారి పరిశీలిస్తే ఆయన యవ్వన దశ నుంచి కెరీర్ పరంగా ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారో అర్ధం అవుతుంది. మాస్ వర్గాలని, కుటుంబ ప్రేక్షకులని సమన్వయపరచుకుంటూ ఆయన ఏడాదికి డజను సినిమాలు చేసిన సందర్భాలు అనేకం. అలానే అధిక ఖర్చు తో కూడుకున్న చిత్రాలు, నిర్మాతలని రిస్క్ లో పెట్టే కథను ఆయనని ఎక్సయిట్ చేసినప్పుడు బైట నిర్మాతలని బలవంతం చేయకుండా సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీత రామరాజు వంటి ప్రయోగాలు ఎన్నింటినో ఆయన సొంత నిర్మాణంలో చేసుకుని వాటితో కూడా సంచలన విజయాలు నమోదు చేశారు. అందుకే 350 చిత్రాలకి పైగా నటించిన కృష్ణ గారికి ఇప్పటికీ సరైన రీప్లేస్మెంట్ తరాలు మారినా ఎవరూ దొరకటం లేదు.
కృష్ణ గారి నట వారసుడిగా వెండితెరకి రాజకుమారుడు గా పరిచయమై అనతి కాలంలోనే సొంత గుర్తింపు తెచ్చుకున్న నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తండ్రికి రీప్లేస్మెంట్ కాకపోవటానికి గల బలమైన కారణాలని మహేష్ సోదరి, మనసుకి నచ్చింది దర్శకురాలు మంజుల ఘట్టమనేని వివరించారు.
"నాన్న గారు హీరోగా నటించే రోజులలో ఏడాదికి 14 సినిమాలు చేసిన సందర్భాలు కూడా నాకు జ్ఞాపకమే. మా కోసం కొంత సమయం కేటాయించే వెసులుబాటు కూడా ఆయనకీ దక్కేది కాదు. రోజుకి రెండు లేదా మూడు షిఫ్టులుగా సాగే షూటింగ్స్, ఎప్పుడైనా షూటింగ్ లేదనుకుంటే ఆ రోజు ఆయన నటించబోయే తదుపరి చిత్రాలకి కథలు నేరేట్ చేయటానికి రచయితలు ఆయనకీ కూడా వుంటుండేవారు. అంత బిజీ రోజులలో, స్టార్ స్టేటస్ ఉండి, అభిమానుల అంచనాలు ఆయనపై అధికంగా వున్న కాలంలో కూడా ఒక సినిమా ఆడక నష్టపోయి వచ్చిన నిర్మాత ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని సార్లు కేవలం మొహమాటానికి పోయి సినిమాలు ఒప్పుకునేవారు నాన్న గారు. చాలా సందర్భాలలో పారితోషికాలు కూడా పుచ్చుకునేవారు కాదు. తన స్టార్ స్టేటస్ కి తగిన సినిమా ఆ నిర్మాత తీయగలరా లేదా అనే ఆలోచన లేకుండా నష్టపోతున్న నిర్మాతని ఆదుకునే క్రమంలో అలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వారు. కానీ నేటి తరం లో అలాంటి సాహసాలకు తావు లేదు. మహేష్ వంటి స్టార్ హీరో ఒకటి ఆడకపోతేనే ఆ చిత్రం చేసే బిజినెస్ పై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. ఇవాళ్టి పరిస్థితులలో వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ప్రతి కథని చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి కథ చాలా ఎక్సయిట్ చేసినప్పటికీ ఫ్యాన్ మూవ్మెంట్స్ అంటూ కొన్నిటికి కథ సహకరించకపోతే ఆ కథ వదులుకోవాల్సి వస్తోంది స్టార్ హీరోస్ కి. కాబట్టి నాన్న గారిలా డేరింగ్ డెసిషన్స్ తీసుకోవటం అందరికి సాధ్యపడదు. మహేష్ అందుకు అతీతుడు కాదు." అని సెలవిచ్చారు మంజుల ఘట్టమనేని.

