కన్నడ నటుల మృతికి యూనిట్ దే బాధ్యతా?

స్టంట్స్ సన్నివేశాలు, సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు లేకుండా సినిమాలు ఎన్నడూ తయారు కావు. అయితే షూటింగ్ లో స్టంట్స్ కు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్న చిన్న ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కన్నడ చిత్రం హస్తిగుడి షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్ లోకి దూకిన ఇద్దరు విలన్ పాత్రధారులు దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. హస్తిగుడి షూటింగ్ లో జరిగిన ప్రమాదానికి సంబందించి.. సినిమా యూనిట్ , ఫిలిం మేకర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని.. భద్రత ప్రమాణాలు పాటించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు సోను సూద్ వ్యాఖ్యానిస్తున్నారు.
అరుంధతి చిత్రంలో పశుపతి పాత్రతో పాటూ, అనేక తెలుగు చిత్రాల్లో కూడా విలన్ పాత్రల ద్వారా సోను సూద్ మన ప్రేక్షకులకు చిరపరిచితులే. స్టంట్స్ సన్నివేశాల షూటింగ్ ఆయనకు కొత్తేమీ కాదు. అయితే కన్నడ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదం పట్ల స్వచ్ఛందంగా స్పందించిన సోను సూద్.. ప్రమాదం జరిగిన వీడియోను చూసి, ఆ తీరుతెన్నులు గమనిస్తే.. అచ్చంగా.. సినిమా యూనిట్ వారి వైఫల్యం కనిపిస్తున్నదని ఆయన అంటున్నారు.
భారతీయ సినిమా నిర్మాణంలోనే స్టంట్స్ విషయంలో నటుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాణాలు పాటించడం అనేది అసలు అలవాటు లేదని సోను సూద్ విమర్శిస్తున్నారు. ఆయన ప్రస్తుతం జాకీచాన్ తో కలిసి కుంగ్ఫూ యోగ అనే చిత్రంలో నటిస్తున్నారు. జాకీచాన్ చిత్రం షూటింగ్ లో అవసరం తో సంబంధం లేకుండా ప్రతిరోజూ సెట్ వద్ద ఒక అంబులెన్స్, ఒక డాక్టర్ అందుబాటులో ఉంటారని, అలాంటి ప్రమాణాలు మనకు ఎప్పటికి వస్తాయోనని సోనుసూద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాల స్థాయిని బట్టి.. ఇలాంటి ప్రమాణాలు పాటించడం అనేది ఒక విధిగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. అలా చేస్తే తప్ప నటులకు ముందుముందు భద్రత ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

