కత్తికి భయం వేస్తుంది

కత్తి మహేష్.. ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోళ్ళల్లో నానుతున్న పేరు. క్రిటిక్ గా సినిమాల గురుంచి రివ్యూలు రాసే కత్తి మహేష్... బిగ్ బాస్ షో ద్వారా పేరు సంపాదించాడు. ఆ తరువాత అతడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచిన ఇతడు… అప్పటి నుండి ఏదో ఓ విషయం పై వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో కోపగించిన పవన్ అభిమానులు అతడిని బెదిరించారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని అన్నారు. కానీ ఆ విషయం పై తానేమీ తప్పుగా మాట్లాడలేదని.. తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న భావాలను చెప్పానని అతడు అన్నాడు. అయినా పవన్ అభిమానులు అతడిని కొద్ది రోజులపాటు విసిగించారు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ను స్పందించాలని ఆయన అభిమానులు కోరినప్పటికీ పవన్ స్పందించలేదు.
మళ్ళీ ఈ మధ్య విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ పై తన భావాలను చెప్పిన కత్తి మహేష్ ఈ టీజర్ అచ్చం ‘అత్తారింటికి దారేది’ని పోలి ఉందని.. కొత్తగా ఏమీ లేదని.. సినిమాటోగ్రఫీ , సంగీతం మాత్రమే కొత్తగా ఉన్నాయని.. సినిమాటోగ్రఫీ, సంగీతం విభాగాల్లో ఆ చిత్రానికి పని చేసిన వారు.. ఈ చిత్రానికి చేయలేదు కాబట్టే ఇందులో ఆ అంశాలు కొత్తగా ఉన్నాయని.. అంతకు మించి ఈ టీజర్ లో ఏమీ లేదని కత్తి మహేష్ తెలిపాడు.
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై కూడా వ్యాఖ్యలు చేసి కత్తి మహేష్ పదేపదే పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యల పై కూడా పవన్ ‘అజ్ఞాతవాసి’ కాదు ‘అజ్ఞాన వాసి’ అని అన్నాడు కత్తి మహేష్..
పవన్ కళ్యాణ్ ప్రతి చర్యను గమనిస్తున్న మహేష్ విమర్శలకు పదునుపెడుతూనే ఉన్నాడు. అన్నలాగే పవన్ కళ్యాణ్ కు కూడా రాజకీయంగా ఏమి తెలీదని, ఇంకా అతనిలో పరిపక్వత రాలేదని మహేష్ ఘాటుగా స్పందిస్తున్నాడు. అదే సమయంలో తనమీద కులం ముద్ర వేయొద్దని చెబుతున్న పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్ మీద స్పందించడం ఏమిటని మహేష్ ప్రశ్నిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మహేష్ ను ఉతికి ఆరేస్తున్నారు. దేవుడిలాంటి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, అసలు అతనికి పవన్ గురించి మాట్లాడే అర్హతే లేదని అతనిపై కత్తి దూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ కు ఫోన్ చేసి రాయలేని భాషలో తిడుతున్నారని, మానసికంగా తాను దెబ్బతింటున్నానని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు సర్ది చెప్పాలంటూ మహేష్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అది పవన్ కళ్యాణ్ వరకు చేరిందో లేదో తెలీదు కానీ అతను మాత్రం మహేష్ అనే పేరు ఎక్కడా ఉచ్ఛరించడం లేదు. పవన్ కళ్యాణ్ స్పందించేంత వరకు అతని మీద తన విమర్శలు కొనసాగుతూనే ఉంటాయని కత్తి మహేష్ చెబుతున్నాడు. .

