కండల వీరుడిని ఆ పాపం ఇంకా వెంటాడుతోంది!

బిడ్డచచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా తయారైంది పరిస్థితి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కాన్ కృష్ణ జింకను వేటాడిన వ్యవహారాన్ని జనం ఎప్పుడో మరచిపోయారు. పనిగట్టుకుని ఆయన మీద విమర్శలు గుప్పించే వాళ్లు తప్ప.. ఆయన జింకల వేట గురించి ఆలోచిస్తున్న వాళ్లు లేరు. మరోవైపు హైకోర్టు కూడా ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే మొత్తానికి కృష్ణ జింక ను వేటాడిన కేసులో రిలీఫ్ దక్కినట్లేనని సల్మాన్ కాన్ ఊపిరి పీల్చుకున్నారు.
అయతే సల్మాన్ ఖాన్ కష్టాలు సాంతం తొలగిపోయినట్లు లేదు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం ఇదే కేసును సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. దీంతో సల్మాన్ కు మళ్లీ కష్టాలు మొదలైనట్లే. మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ సాగినా ఆశ్చర్యం లేదు. ఆయనకు శిక్ష పడినా ఆశ్చర్యం లేదు అని నిపుణులు భావిస్తున్నారు. ఒకసారి రాజస్థాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ పట్ల ప్రత్యేకమైన దయ, జాలి ఏమీ కనపరచకుండా కేసును తిరగతోడ దలచుకున్న తరువాత.. సుప్రీంలో సింగిల్ బెంచ్ కేసును కొట్టేసినా, మళ్లీ ఫుల్ బెంచ్ ను ఆశ్రయించేందుకు కూడా అవకాశం ఉంటుంది.
మొత్తానికి సల్మాన్ ఖాన్ కు చీకటి రోజులు ఇంకా తొలగిపోయినట్లు లేదు. ఈ కేసు విచారణ సమయంలో ఎక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయన మళ్లీ జైలుకు పోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

