ఒరిజినల్ కంటె ఇదే మెరుగ్గా ఉంటుందిట

కిక్ 2 చిత్ర పరాజయంతో షాక్ తిన్న దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఆ వైఫల్యం నుంచి బైటకు రావటానికి చాలా కాలమే పట్టింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో తన్ని ఊరువం రీమేక్ గా ధృవను తెరకెక్కించి ఇప్పుడు రానున్న శుక్రవారం నాడు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులలో ఎక్కువ శాతం తమిళ వెర్షన్ వీక్షించేయగా వారికి వచ్చిన సందేహం అరవింద్ స్వామి పాత్రను అదే రీతిలో చిత్రీకరిస్తారు లేక చరణ్ స్టార్ స్టేటస్ దృష్టిలో ఉంచుకుని ఆ పాత్ర పరిధి, పరిమితి తగ్గించారా అని? ఈ సందేహాలకు సమాధానమిస్తూ తాను తెలుగు వెర్షన్ కు చేసిన మార్పులు ప్రేక్షకులను రంజింపచేస్తాయి అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు సురేందర్ రెడ్డి.
ధ్రువ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కథానాయకుడి పాత్రతో పాటు ప్రతినాయకుడు పాత్ర గురించిన వివరాలు తెలుపుతూ, "అరవింద్ స్వామి పాత్రను ఏ మాత్రం పరిమితులు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాజెక్ట్ చేసాం. తమిళ వెర్షన్ లో కన్నా ధ్రువ లో చెర్రీ పాత్ర ఇంటెన్సిటీ పెంచిన కారణాన ధీటుగా ప్రతినాయకుడు ఉండాలి అన్న ఆలోచనతో అరవింద్ స్వామి పాత్ర మరింత స్టైలిష్ గా చిత్రీకరిస్తూ, మాతృకలో కన్నా తెలుగులో కొంత నిడివి పెంచటం జరిగింది. తమిళ మాతృక కంటే ధ్రువ అధిక రెట్లు ప్రేక్షకాదరణ పొందుతుంది అనే బలంగా నమ్ముతున్నాం. అయితే అంతిమ తీర్పు నిర్ణయించేది ప్రేక్షకులే కనుక 9 వ తారీకు కోసం ఎదురు చూస్తున్నాను." అని వివరించారు సురేందర్ రెడ్డి.

