ఏ పాత్రకి ఎవరు?

రామ్ గోపాల్ వర్మ ఏదో బెదిరించడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎనౌన్స్ చేసాడు అనుకుంటే... కేవలం బెదిరింపు కాదు సినిమా స్క్రిప్ట్ రెడీ అవ్వడమే కాదు 2018 ఫిబ్రవరి నుండి సినిమా మొదలవ్వబోతుందంటూ ప్రకటించేశాడు. ఇక కచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వర్మ తియ్యడం ఖాయమని ఫిక్స్ అయ్యింది. మరి సినిమా నిర్మాత విషయంలో కాంట్రవర్సీకి తెర లేపి వైసిపి ఎమ్యెల్యే రాకేష్ రెడ్డిని లక్ష్మీస్ ఎన్టీఆర్ కి నిర్మతగా సెలెక్ట్ చెయ్యడం దగ్గరనుండి ప్రతి ఒక్క విషయంలోనూ టిడిపికి వ్యతిరేఖంగా నడుచుకోవడం, టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ పై విపరీతమైన క్రేజ్ తెస్తున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని నటీనటుల ఎంపిక విషయంలో ఎలాంటి రచ్చ చేస్తాడో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక వైసిపి ఎమ్యెల్యే రోజాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఒక పాత్ర ఇస్తానని చెప్పడం.. దానికి రోజా కూడా సానుకూలంగా స్పందించడం చూస్తుంటే మాత్రం రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు నెలవైన లక్ష్మి పార్వతి పాత్రని రోజాకి ఇస్తున్నాడా? అనే అనుమానం వచ్చేసింది అందరికి. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ఎంటర్ అయిన దగ్గరనుండి సినిమా స్టార్ట్ చేస్తున్నాని చెప్పిన వర్మ లక్ష్మి పార్వతి పాత్రకు గల ప్రత్యేకతని చెప్పకనే చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ పాత్రకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కీలకపాత్ర అయిన చంద్రబాబు నాయుడు పాత్రకి గెడ్డం చక్రవర్తిని(జెడి చక్రవర్తిని) సంప్రదిస్తునంట్టుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వర్మ ముంబై లో ఉన్న జెడి చక్రవర్తిని చంద్రబాబు పాత్రకి సంప్రదించినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి కాంట్రవర్సీలకు నెలవు అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటీనటులు వివరాలు రివీల్ అయ్యేవరకు ఇలా ఆ సినిమాలోని పాత్రలకు ఇలా ఒక్కొక్కరి నటీనటుల పేర్లు ఊహించేస్తూనే ఉంటారు మరి. చూద్దాం ఫైనల్ గా ఏ పాత్రలో ఎవరు సెట్ అవుతారో..

