ఈయనని 'కంప్లీట్ యాక్టర్' అనేది ఇందుకేనేమో

యవ్వన వయస్కులు శరీర బరువులో ఆరు నుంచి ఏడు కిలోలు తగ్గటానికి పడే కష్టం మాటలలో చెప్పలేనిది. అలాంటిది 57 సంవత్సరాల వయసులో వున్న వ్యక్తి 30 సంవత్సరాల వయసు యువకుడిలా మారిపోవటానికి పడే పాట్లు ఊహకి అందనివి. అలాంటి రిస్క్ తో కూడుకున్న ప్రయోగమే చేసి సఫలమై అందరిని మరోసారి తన వైపుకి తిప్పుకున్నారు మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్. జనతా గ్యారెజ్, మనమంతా చిత్రాలతో నేటి తరం తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా చేరువ అయిన మోహన్ లాల్ ప్రస్తుతం తన వరుస మళయాళ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండటంతో షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నారు.
మోహన్ లాల్ నటిస్తున్న చిత్రాలలో శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఒడియాన్ అనే చిత్రం మోహన్ లాల్ కెరీర్ లోనే చాలా కీలకమైన చిత్రంగా నిలవబోతోంది. 57 సంవత్సరాల వయసులో ఈ చిత్రాన్ని ఒప్పుకున్న మోహన్ లాల్ ఆ చిత్రంలో కొంత భాగంలో తాను యువకుడిలా కనిపించాల్సి ఉండగా అందరి హీరోలలా శరీరంలో కావలసిన మార్పులకి కెమెరా గ్రాఫిక్స్ ని నమ్ముకోకుండా స్వతహాగా శ్రమించి తన శరీర బరువుని సరిగ్గా సగానికి తగ్గించుకుని ఈ ఛాలెంజింగ్ పాత్ర పోషించటానికి సిద్ధమైపోయారు. అంతటి డెడికేషన్ వున్న నటుడు కాబట్టే కంప్లీట్ యాక్టర్ అని అభిమానులు ఆయనని పిలుస్తుంటారు కాబోలు

