ఈ వారం టాలీవుడ్లో విన్నర్ ఎవరు... హిట్... ఫట్ లిస్ట్ ఇదే

టాలీవుడ్లో ఈ వారం ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిల్లో ఒక్కటే పక్కాగా తెలుగు సినిమా. మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు సినిమా కంప్లీట్ తెలుగు సినిమా. మిగిలిన మూడు సినిమాల్లో విజయ్ అదిరింది తమిళ్ వెర్షన్ మెర్సల్‌కు డబ్బింగ్. ఇక విశాల్ తమిళ్లో చేసి హిట్ కొట్టిన తుప్పరివాలన్కు డిటెక్టివ్ డబ్బింగ్. ఇక సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య ద్విభాషా సినిమా. ఈ నాలుగు సినిమాల్లో విజయ్ అదిరింది గురువారమే థియేటర్లలోకి దిగితే, మిగిలిన మూడు శుక్రవారమే వచ్చాయి.
ఈ నాలుగు సినిమాల విషయానికి వస్తే పక్కా తెలుగు సినిమా అయిన మనోజ్ ఒక్కడు మిగిలాడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు కూడా తమిళ వ్యక్తి అజయ్ ఆండ్రూస్. అతడు గతంలో తీసిన రావణదేశం సినిమానే అటూ ఇటూ తిప్పేసి ఈ సినిమాను తీశాడన్న విమర్శలు వస్తున్నాయి. వసూళ్ల పరంగా చూస్తే ఈ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకువెళుతోంది.
మిగిలిన మూడు సినిమాల పరిస్థితి బాగానే ఉంది. వీటిల్లో విజయ్ అదిరింది సినిమా టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాకు తమిళ్లో ఏర్పడిన వివాదాలు, ఇక్కడ కూడా హైప్ ఉండడంతో బాగా కలిసొచ్చింది. తొలి రోజు ఇక్కడ అదిరిందికి ఏకంగా రూ 1.6 కోట్ల షేర్ రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగులో విజయ్‌కు మంచి మార్కెట్ ఏర్పడడం దాదాపు ఖరారైనట్టే. అదిరింది భారీ లాభాల దిశగా దూసుకువెళుతోంది. ఆదివారం వరకు ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లు చాలా వరకు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ సినిమా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలా వసూళ్లు రాబడుతోంది.
ఇక విశాల్ డిటెక్టివ్ ఏ క్లాస్, మల్టీఫ్లెక్స్‌ల్లో సూపర్ హిట్ టాక్‌తో వెళుతోంది. ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కూడా హిట్ కేటగిరిలో చేరినట్టే. ఇక సందీప్ కిషన్ కేరాఫ్ సూర్యకు టాక్ ఓకేలా ఉన్నా వసూళ్లు కూడా ఓ మోస్తరుగా ఉన్నాయి. ఈ సినిమాకు స్వల్ప నష్టాలతో భయటపడుతుందా ? లేదా గట్టెక్కేస్తుందా ? అన్నది చూడాలి. ఇక తెలుగు సినిమా ఒక్కడు మిగిలాడు సినిమా మంచి ఉద్దేశంతో తీసిందే అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం దయనీయంగా ఉన్నాయి. ఈ సినిమా భారీ నష్టాలను మూటకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రేక్షకులు అందరూ అదిరింది, డిటెక్టివ్, కేరాఫ్ సూర్య సినిమాలు ఆడుతోన్న థియేటర్ల వైపే తొంగి చూస్తున్నారే కాని ఒక్కడు మిగిలాడు సినిమా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. షాక్ ఏంటంటే తొలి రోజే ఈ సినిమా సగానికి పైగా థియేటర్లలో హౌస్ ఫుల్ కాలేదట. ఏదేమైనా అదిరింది, డిటెక్టివ్‌కు మంచి టాక్ వస్తే, కేరాఫ్ సూర్య యావరేజ్గాను, ఒక్కడు మిగిలాడు ప్లాప్ టాక్‌తో రన్ అవుతున్నాయి.

