ఈ అమ్మాయి పేరు షమ్నా ఖాసీం

కథానాయకులకు ఎంత క్రేజ్ వున్నా వారు సాధారణంగా ఒక భాషకే పరిమితమవుతుంటారు. మహా అయితే అడపా దడపా వారు చిత్రాలు అనువాదమై ఇతర రాష్ట్ర ప్రేక్షకులను పలకరిస్తాయి ఏమో కానీ నేరుగా ఇతర భాషల్లో సినిమాలు చేసే అవకాశం కథానాయకులకు చాలా అరుదుగా ఉంటుంది. కానీ కథానాయికల పరిస్థితి ఆలా ఉండదు. తెలుగు లో ఒక్క పెద్ద సక్సెస్ పొందితే మలయాళం, కన్నడ, తమిళం లో వరుస అవకాశాలతో పాటు అదృష్టం బాగుంటే బాలీవుడ్ లోను అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మన అగ్ర స్థాయి కథానాయకులు పొరుగు రాష్ట్రాల్లో తెలియనప్పటికీ కథానాయికలు అందరికి సుపరిచితమే.
పలు భాషల్లో ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాల్లో అన్నీ రాష్ట్రాల వారు పలికాటానికి సులభంగా వుండే పేరును స్క్రీన్ నేమ్ గా నామకరణం చేసుకుంటుంటారు కథానాయికలు. శ్రీదేవి, జయప్రద, రంభ, సౌందర్య, నయనతార, అనుష్క వంటి ప్రముఖ తారలు అందరూ ఈ కోవకే చెందుతారు. జయమ్ము నిశ్చయమ్ముతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చిన కథానాయిక పూర్ణ కూడా తన పేరు వెనుక దాగివున్న కథను పంచుకుంది. "నా అసలు పేరు షమ్నాఖాసీం. అయితే నేను తమిళ పరిశ్రమకి పరిచయం ఐన కొత్తలో నా పేరు పలకటానికి చాలా మంది ఇబ్బంది పడుతుండేవారు. దానితో నా పేరును మార్చుకోవాలని నిర్ణయించుకుని దక్షిణ రాష్ట్రాల్లో ప్రజలకు సులభంగా చేరువ అయ్యే పేరు అన్వేషణలో ఉండగా, అప్పట్లో నా మేనేజర్ చిన్న కూతురు పేరు పూర్ణ కావటం, ఆ పేరు నాకు నచ్చటంతో పూర్ణగా స్క్రీన్ పై పరిచయం అయ్యాను. పేరు మార్చుకున్నాక సినీ జీవితం చూసుకుంటే కలిసివచ్చింది అనే చెప్పాలి." అని తన అసలు పేరు తెర చాటుకు వెళ్ళటానికి గల కారణాన్ని వివరించింది పూర్ణ.

