ఆలస్యానికి కారణం అదా..?

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే మహేష్ 'స్పైడర్' చిత్రం అన్ని విషయాల్లోనూ ఎంతో నత్తనడకన సాగుతుంది. అంటే ఫస్ట్ లుక్ కానివ్వండి, టీజర్ కానివ్వండి... ఆఖరికి 'స్పైడర్' విడుదల కానివ్వండి అన్ని విషయాల్లోనూ ఏంతో నెమ్మదిగా వున్న స్పైడర్ చిత్రంపై మహేష్ అభిమానులు మాత్రం చాలా గుర్రుగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంతిలా ఆలస్యమవడానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకసారి మహేష్ వల్ల షూటింగ్ లేట్ అంటారు. మరోసారి మురుగదాస్ వల్ల షూటింగ్ లేట్ అంటూ ఏవేవో గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి.
అయితే 'స్పైడర్' ఆలస్యానికి కారణం మాత్రం పైన చెప్పినవి కాదంటున్నారు. అసలు మహేష్ 'స్పైడర్' ఆలస్యానికి అసలు కారణం మాత్రం 'స్పైడర్' ని రెండు భాషల్లో తెరకెక్కించడమే నట. తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్... రెండు భాషలకు కలిపి ఒకే సీన్ చెయ్యడం లేదట. తెలుగు వెర్షన్ కి ఒక సీన్, తమిళ వెర్షన్ కి కావాల్సిన సీన్ షూట్ చెయ్యడం వలెనే ఈ చిత్ర జాప్యానికి కారణమంటున్నారు. రెండు భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అంటే కేవలం రెండు భాషలకు డబ్బింగ్ చెప్పించేసి విడుదల చెయ్యకుండా రెండు భాషలకు రెండు సార్లు సీన్స్ షూట్ చెయ్యడంతో ఇంత లేట్ అయ్యిందంటున్నారు.
మురుగదాస్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండడం వలెనే సినిమా విడుదలకు ఆలస్యమైందని చెబుతున్నారు. అందుకే మహేష్ కూడా మురుగదాస్ పై ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా గమ్మునుండిపోయాడట. ఇకపోతే మహేష్ 'స్పైడర్' టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల చివరిలో మరో టీజర్ తో మహేష్ అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో మహేషుకి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

