Thu Dec 25 2025 23:06:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రకంగా వాళ్లూ రికార్డు సృష్టించారు

2017 సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలలో రెండు చిత్రాలు మెగా స్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150, నందమూరి బాల క్రిష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ రెండు చిత్రాలు పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతుండగా బాహుబలి ది కంక్లూషన్ చిత్రానికి తొలి నుంచి ప్రపంచవ్యాప్తం గా క్రేజ్ వుంది. ఈ మూడు చిత్రాలు 2017 లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. కాగా ఇప్పటికే ఫాన్సీ రేట్లకు ఈ చిత్రాల థియేట్రికల్ విడుదల హక్కులను ప్రాంతాల వారీగా పంపిణీదారులు కొనేసుకున్నారు. వారిలో ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా వున్నాయి.
ఇప్పుడు ఈ మూడు భారీ చిత్రాల ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ ఒక్కటే కైవసం చేసుకోవటం విశేషం. రానున్న రెండు నెలలో గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 పాటల విడుదల వేడుకలు నిర్వహించనున్నారు ఆయా చిత్ర నిర్మాతలు. వాటితో పాటు బాహుబలి ది కంక్లూషన్ ఆడియో రైట్స్ కి కూడా ఇప్పుడే భారీ మొత్తం చెల్లించి లహరి మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు.
ఖైదీ నెం.150 చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తుండగా, గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి గతంలో దర్శకుడు క్రిష్ తో కంచె చిత్రానికి పని చేసిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత బాధ్యతలు చేపట్టారు. రాజమౌళి గత చిత్రాల వలెనే బాహుబలి ది కంక్లూషన్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకులు.
Next Story

