అవి నెత్తుటిమరకల శాంతివచనాలు!
'ఓం శాంతిః' అనే అత్యంత సింపుల్ పదాన్ని పలకడం ద్వారా కూడా దాన్ని విన్న వారి దృష్టిలో వెటకారపు భావనను కలిగించగల వెరైటీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి. నిస్సందేహంగా అలాంటి తెలివితేటలు రాంగోపాల్ వర్మకు మాత్రమే ఉంటాయి. తెలుగు పరిశ్రమ గర్వంగా చెప్పుకోగలిగిన స్థాయి దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మ.. 'సినిమా' అనే ఫార్మాట్ మీద తన ప్యాషన్ ను కోల్పోయిన తర్వాత.. చిల్లర సినిమాలు తీసే క్రమంలో మరో సినిమా వంగవీటి అనే పేరుతో ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.
విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ చేస్తున్నారు. వంగవీటి రంగా జీవితం, హత్య నేపథ్యంలోనే చిత్రం తయారవుతున్న మాట వాస్తవం. అయితే కేవలం రౌడీయిజం, రక్తపాతపు క్రేజ్ మాత్రమే కాకుండా, రామూ.. ఈ చిత్రానికి 'కాపు కాసే శక్తి' అనే ట్యాగ్‌లైన్ తగిలించడం ద్వారా.. కులంరంగు కూడా పులిమి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కులంగొడవ హాట్‌గా నడుస్తూ ఉన్న నేపథ్యంలో.. కాపు ఉద్యమానికి ఉన్న ఆకర్షణ సినిమాకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారేమో తెలియదు.
అయితే వర్మ స్టయిల్ ట్విస్టు ఏంటంటే.. శాంతి, అహింస లకు ప్రతీక అయిన మహాత్మాగాంధీ జయంతి రోజున.. ఆయన వంగవీటి సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విటర్ లో ఎంచక్కా.. వంగవీటి టీజర్‌ను విడుదల చేసి.. ఓం శాంతిః అంటూ వర్మ ముగించారు. అయినా.. ఆ స్టయిల్లో రక్తపు మరకలు పూసిన శాంతి వచనాలను పలకడం ఆయనకు మాత్రమే సాధ్యం అని జనం జోకులేసుకుంటే తప్పేముంది.