అల్లరోడికి మిగిలింది రెండు వారాలే

కెరీర్ ప్రారంభం నుంచి విరామం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో అల్లరి నరేష్. అతి తక్కువ కాలంలో 50 చిత్రాలు పూర్తి చేసిన నేటి తరం కథానాయకుడిగా అల్లరి నరేష్ కి రికార్డు కూడా వుంది. కెరీర్ తొలి దశ నుంచి ఏడాదికి సగటున నాలుగు చిత్రాలు విడుదల చేసిన అల్లరోడికి వాటిల్లో కనీసం ఒక్క చిత్రం హిట్ అవుతుండటంతో ప్రతి సంవత్సరం విజయంతో ప్రేక్షకులకు చేరువ అవుతూ ఉండేవాడు. పైగా అల్లరి నరేష్ ప్రతి నాలుగు చిత్రాలకు ఒక చిత్రం ఆయన తండ్రి ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించేవారు. అనారోగ్య కారణాన ఈ.వి.వి. అకాల మరణం చెందటంతో అల్లరి నరేష్ కి చిత్రాల సంఖ్యా తగ్గలేదు కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి.
యముడికి మొగుడు, యాక్షన్ 3D , కెవ్వు కేక, లడ్డు బాబు, జంప్ జిలాని, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, బందిపోటు, జేమ్స్ బాండ్, మామ మంచు అల్లుడు కంచు, సెల్ఫీ రాజా అంటూ వరుసగా పది వైఫల్యాల భారం నెత్తిపై ఉండగా ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రంలో నటించి ప్రేక్షకులు అఆదరించే హారర్ కామెడీ జోనర్లో కడుపుబ్బా నవ్వించే కామెడీతో సినిమా ఉంటుంది అని ప్రచారాలు కూడా చేసాక పెద్ద నోట్ల రద్దు కారణాన విడుదల వాయిదా వేయటం, అది కూడా తదుపరి వారాల్లో విడుదలకు కాక ఏకంగా డిసెంబర్ కు వాయిదా వేశారు నిర్మాత ప్రసాద్. ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేం భయం విడుదల తేదీ డిసెంబర్ 30 అంటూ కొత్త తేదీ ప్రచారం చేస్తున్నారు.
డిసెంబర్ ప్రథమార్ధంలో ధ్రువ, ఎస్ త్రీ చిత్రాలు ఉండటంతో, 23 న యుద్ధం, నేను లోకల్, వంగవీటి చిత్రాలు ఉండటంతో 30 న రావటానికి సిద్ధపడుతుంది ఇంట్లో దెయ్యం నాకేం భయం బృందం. కాకపోతే అల్లరి నరేష్ ఎదురు చూస్తున్న భారీ విజయం సాధించాలి అంటే కనీసం మూడు వారాలు థియేటర్లలో ఈ చిత్రం సందడి చెయ్యాలి. కానీ సంక్రాంతి పండుగకు గౌతమీ పుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 విడుదలలు ఉండటంతో అల్లరోడికి కేవలం రెండు వారాలే దక్కుతుంది. మరి ఎంత వేగంగా ప్రేక్షకులలోకి ఈ చిత్రం వెళ్లి హౌసేఫుల్స్ తో రెండు వారాలు ప్రదర్శించబడితే అల్లరోడి ఆశ నెరవేరే అవకాశం ఉంటుంది.

