అర్జున్ రెడ్డిని పొగిడిన దర్శకధీరుడు

విజయ్ హీరోగా సందీప్ వంగా డైరెక్షన్ లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సూపర్ హిట్ అందుకుని కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా వచ్చి దాదాపు నాలుగు రోజులు కావొస్తుంది. సినిమాలో కొంచెం వల్గారిటీ ఉన్నా... ఇప్పుడున్న యూత్ కి ఆ వల్గారిటీ బాగా నచ్చడంతో సినిమాని విజయపధంలో దూసుకెళ్లాలా చేశారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వచ్చేసి అప్పుడే లాభాలను జేబులో వేసుకునే పనిలో పడ్డారు చిత్ర నిర్మాతలు. ఇక ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్టయ్యింది అంటే ఆ సినిమాపై ప్రశంసలు కురిపించే బాహుబలి మూవీ సృష్టికర్త దర్శక ధీరుడు ఇప్పుడు ఈ 'అర్జున్ రెడ్డి' విషయంలో ఈ నాలుగు రోజులనుండి ఎలాంటి ట్వీట్ చెయ్యకుండా సైలెంట్ అయ్యాడు.
అయితే కొంతమందికి మాత్రమే రాజమౌళి ప్రశంసలు దక్కుతాయని.. ఏ సినిమా అయినా హిట్టయితే రాజమౌళి దాన్ని అభినందించేవాడని... కానీ 'అర్జున్ రెడ్డి' విషయంలో రాజమౌళి స్పందన లేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం స్టార్ట్ చేశారు. అయితే టాలీవుడ్ లో ఈ మధ్యన రాజమౌళి సోషల్ మీడియా స్పందనకి మంచి గిరాకీ ఏర్పడింది. అందులో భాగంగానే 'అర్జున్ రెడ్డి' విషయంలో కొంతమంది అభిమానులు ఇలా రియాక్ట్ అయ్యారు. అయితే ఇలా సోషల్ మీడియాలో హాట్ డిస్కర్షన్ జరుగుతున్న కొన్ని గంటల్లోనే రాజమౌళి 'అర్జున్ రెడ్డి' సినిమాని ఇప్పుడే చూశానని.. సినిమా బాగుందని ట్వీట్ చేసాడు.
అంతేనా తాను ప్రేమ కథలకు కొంచెం దూరమని చెబుతూనే 'అర్జున్ రెడ్డి' చిత్రంలో విజయ్ నటన అద్భుతమని... చాలా నేచురల్ గా నటించాడని.. అలాగే హీరోయిన్ కూడా బాగా చేసిందని మెచ్చుకున్నాడు. ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ సందీప్ వంగాకే చెందుతుందని.. ఆకాశానికెత్తేసాడు. 'అర్జున్ రెడ్డి' చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు రాజమౌళి. ఇక రాజమౌళి ట్వీట్ తో 'అర్జున్ రెడ్డి'కి అదనపు బూస్ట్ వచ్చేసిందని అంటున్నారు.

