అర్జున్ రెడ్డి హిందీ హీరో ఎవరో తెలుసా?

ఈ సంవత్సరం తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ అంతే భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటన, అతడి మాటలు యువతను కట్టిపడేశాయి. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్లు కురిపించింది. ఈ చిత్రం రీమేక్ హక్కులు సైతం భారీ రేట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తమిళ రీమేక్ ‘వర్మ’ అని తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో చియాన్ విక్రమ్ తనయుడు ‘ధృవ్’ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఈ చిత్రం హిందీ రీమేక్ లో తొలుత రణ్వీర్ సింగ్ నటిస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ పాత్ర మరో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కు వెళ్లిందనే టాక్ వినబడుతుంది. ఇప్పటికే పద్మావతి చిత్రంలో అలావుద్దీన్ ఖిల్జీ వంటి నెగటివ్ పాత్రను పోషించిన రణ్వీర్ వెంటనే మరోసారి నెగటివ్ ఛాయలున్న పాత్రను చేయడానికి సిద్ధంగా లేడట. దాంతో ఈ చిత్రం షాహిద్ కపూర్ వద్దకు వెళ్లిందని సమాచారం. ఇప్పటికే ‘ఊడ్త పంజాబ్’ చిత్రంలో డ్రగ్స్ కు బానిసైన రాక్ స్టార్ గా షాహిద్ నటన విమర్శకులను మెప్పించింది.
అందుకే ఈ అర్జున్ రెడ్డి పాత్ర కూడా షాహిద్ కి నప్పుతుందని భావిస్తున్నారట చిత్ర నిర్మాతలు. అలాగే ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే హిందీలో కూడా దర్శకత్వం వహించే అవకాశముంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

