‘అమ్మ’ అనిపించుకోవాలని ముద్దుగుమ్మకు మోజు!

కేవలం ఇవాళ తాను శాసిస్తున్న రాజకీయ రంగం మాత్రమే కాదు.. ఒకప్పుడు అందాల తారగా తాను ఏలినటువంటి సినీరంగంలో కూడా కలిపి పురట్చి తలైవి జయలలిత జీవితం అసామాన్యమైనది. ఇప్పుడు ఆమె అనారోగ్యంగా ఉండగా ఆమె పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమానాన్ని గమనిస్తే.. ఎవ్వరికైనా సరే.. ఆమె జీవితం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే కాబోలు.. అందాల తార త్రిష..తనకు జయలలిత పాత్రలో నటించాలని ఉన్నదంటూ మనోగతాన్ని బయటపెడుతోంది.
ప్రస్తుతం బయోగ్రఫీల యుగం నడుస్తోందని, అలా జయలలిత బయోగ్రఫీని ఎవరైనా తెరకెక్కించగలిగితే.. తనకు అందులో ఆమె పాత్ర పోషించాలని ఉన్నదని తెలిపింది. అయితే వీరిద్దరికీ ఓ కోఇన్సిడెన్స్ ఉన్నదండోయ్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. చర్చి పార్క్ స్కూల్లోనట! జయలలిత జీవిత పాత్రలో నటిస్తే స్ఫూర్తి దాయకంగా ఉంటుందని త్రిష అంటోంది.
అచ్చంగా జయలలిత జీవితపు పాత్ర అని అనలేం గానీ.. ఇదే తమిళ రాజకీయాలను ప్రతిబింబిస్తూ మణిరత్నం గతంలో తీసిన ‘ఇరువర్’ (ఇద్దరు) చిత్రంలో జయలలితను పోలిన పాత్రను ఐశ్వర్యా రాయ్ పోషించారు. నిజానికి అది ఆమె మొదటి సినిమా. అందులో జయలలితను పోలిన పాత్రతో పాటు, ద్విపాత్రాభినయం చేసి.. అద్భుతంగా మెప్పించారు ఐశ్వర్యారాయ్.

