అభిమానులని ఎదుర్కోలేక గేట్ దూకిన హీరో

సంక్రాంతి పండుగ సందర్భముగా విడుదలైన తమిళ అనువాద చిత్రం గ్యాంగ్ తొలి రోజు కంటే అధిక వసూళ్లతో రోజు రోజుకి మెరుగవుతుండగా పెరుగుతున్న పాజిటివ్ రిపోర్ట్స్ కి తనవంతు బలాన్ని చేకూరుస్తూ పండుగ పర్వదినాన హీరో సూర్య తెలుగు రాష్ట్రాలలో గ్యాంగ్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్స్ కి వెళ్లి అభిమానులతో సినిమా విశేషాలు ముచ్చటిస్తూ గ్యాంగ్ చిత్ర ప్రొమోషన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. వైజాగ్ ప్రాంతంలో మొదలుకొని గోదావరి జిల్లాలని దాటుకుని విజయవాడ నగరం వరకు కొనసాగిన ఈ ప్రచార కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి.
ఈ ప్రమోషనల్ టూర్ లో భాగంగా రాజమహేంద్రవరం లో గ్యాంగ్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ కి వెళ్లిన సూర్యకి అక్కడ అభిమానులతో ముచ్చటించి నిష్క్రమించే సమయంలో ఊహించని పరిణామం ఎదురైయ్యింది. సూర్య తమ ఊరు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు, థియేటర్ లో ఉన్న ప్రేక్షకులతో సూర్య ముచ్చటించి బైటకి వచ్చే సమయానికి కలుసుకోవాలని థియేటర్ మెయిన్ గేట్ వద్దగా భారీ సంఖ్యలో గుమిగూడారు. అభిమానుల తాకిడి అధికం కావటంతో చేసేది లేక సూర్య తాళం వేసివున్న వెనుక గేట్ దూకి తన వాహనం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది.


