అన్నీ పోయి లైన్ క్లియర్

రిపబ్లిక్ డే సందర్భముగా ఈ శుక్రవారం (26 జనవరి 2018 ) న తమ చిత్రాలని విడుదల చేస్తునట్టు ప్రకటించారు సదరు చిత్రాల నిర్మాతలు. ఈ జాబితాలో మనసుకి నచ్చింది, ఆచారి అమెరికా యాత్ర, భాగమతి లతో పాటు తమిళ అనువాద చిత్రం టిక్ టిక్ టిక్ కూడా వున్నాయి. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో చిత్రం ఈ శుక్రవారం విడుదల నుంచి తప్పుకుని వెనక్కి తగ్గుతున్నాయి. ముందుగా చదలవాడ బ్రదర్స్ తమ టిక్ టిక్ టిక్ చిత్ర విడుదల ఫిబ్రవరి కి వాయిదా వేసుకోగా, అనుకున్నన్ని థియేటర్స్ అందుబాటులో లేని కారణంగా మనసుకి నచ్చింది చిత్రం ఫిబ్రవరి 16 కి వాయిదా పడింది.
గత ఏడాది రిపబ్లిక్ డే కి లక్కున్నోడు గా వచ్చిన మంచు విష్ణు ఈ సారి ఆచారి అమెరికా యాత్ర తో రావటం తధ్యం అనుకుంటున్న తరుణంలో ఏవో సాంకేతిక కారణాల చేత ఈ చిత్రం కూడా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించేశారు నిర్మాతలు. దీనితో 26 న విడుదల కానున్న ఒకే ఒక్క తెలుగు చిత్రం భాగమతి కానుంది. సంక్రాంతి పండుగకి గ్యాంగ్ విడుదల చేసి లాభాలు అందుకున్న యూ.వి.క్రియేషన్స్ వారికి ఇప్పుడు కూడా ఎలాంటి పోటీ లేకుండా తమ భాగమతి చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసుకునే వెసులుబాటు దక్కటంతో భాగమతి విజయం దాదాపుగా ఖరారు అయినట్టే భావించాలి.

