అద్భుతః: అన్నట్టుగా లేదు!

నాని ఇప్పుడు స్టార్ హీరోలు కూడా చేరుకోలేని మైలు రాయిని చేరుకున్నాడు. వరుస హిట్స్ తో అదరగొడుతున్నాడు. కేవలం హీరోగానే టాలెంట్ నిరూపించుకోవాలా...? నిర్మాతగా కూడా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి నాని ఉవ్విళ్లూరుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే మరోపక్క వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అ! సినిమాని నిర్మిస్తున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 16 న ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధమవుతుండగా... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతః: అన్న రీతిలో హైదరాబాద్ లో జరిగింది. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈసినిమాలో కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, శ్రీని అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తుండగా చేపగా నాని, చెట్టుగా రవితేజ వాయిస్ ఓవర్ లు అందిస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి, కీరవాణి లు సతి సమేతంగా హాజరవగా స్పెషల్ గెస్ట్ గా అనుష్క హాజరైంది.
ఇక ఈ ఈవెంట్ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. టాలీవుడ్ మొత్తం ఒక్కచోట చేరిందా అన్నట్టుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇకపోతే స్పెషల్ గెస్ట్ లుగా హాజరయిన రాజమౌళి నాని ని మెచ్చుకుంటూ అ! సినిమా గురించి... 'అ! సినిమాలోనటించిన వాళ్లందరూ నా సన్నిహితులే. ఎవరి గురించి మాట్లాడాలో.. ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. అయితే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ చూశాక మాత్రం దర్శకుడి దగ్గర్నుంచి మొదలుపెట్టాలనిపించింది. అసలు ఒక సినిమా ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించాలి. ట్రైలర్ అసలు ఉద్దేశమే అది. ఆ ఉద్దేశాన్ని అ! వంద శాతం నెరవేర్చింది. అ! సినిమాట్రైలర్ చూడగానే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఒక రోజు ముందే ఈ సినిమా చూసేయాలనిపించింది. అంత బాగా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మకి అభినందనలు అని తెలిపాడు.
అలాగే హీరో నాని గురించి మాట్లాడాలి అంటే... నాని ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అసలు ఎన్ని సినిమాలు హిట్ అందుకున్నాడో అనే విషయం కూడా చెప్పడం కష్టమే. అదే విషయం నాని ని అడిగినా అతని పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. హిట్ అంటే నాని, నాని అంటే హిట్ అనేలా ఉంది. ఇంత హిట్స్ సాధించిన నాని కి నేను కంగ్రాట్స్ చెబుతూ ఒక మెస్సేజ్ పెట్టా. అదేమిటంటే.... హిట్లు కొట్టడం ఓకే. కానీ.. నీ నుంచి ఇంకా పెద్దగా, కొత్తగా ఆశిస్తున్నానని చెప్పాను. దానికి నాని ఒకే చేసేద్దాం అని మాటిచ్చాడు. అక్కడ కట్ చేస్తే నాని అ! సినిమాలో చేప అవతారంలోకి మారిపోయాడు. కానీ నేను అడిగింది ఇది కాదు. అంటూ నాని కి కంగ్రాట్స్ చెప్పడమే కాదు.... ‘అ’ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

