అతి త్వరలో కళ్యాణ్- పూరీల చిత్రం

నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్ర ఘన విజయం తర్వాత రెండు ఘోర వైఫల్యాలు పొంది నిరాశ చెందారు. ఒకటి ఆయన నిర్మించి మాస్ మాహారాజా రవి తేజ నటించిన కిక్ 2 కాగా మరొక చిత్రం ఆయన నటించిన షేర్. ఈ వైఫల్యాల నుంచి బైట పడేందుకు ఆయన తన పంథా మార్చుకుని దర్శకుడు పూరి జగన్నాథ్ దారిలోకి వెళ్లారు. పూరి జగన్నాథ్ చిత్ర కథానాయకుల్లానే తన వేషభాషలు మార్చుకున్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కళ్యాణ్ రామ్ ని చూపించబోతున్నారు దర్శకుడు పూరి. జర్నలిజం నేపథ్యంలో ఒక సామాజిక అంశం చుట్టూ ఇజం కథ తిరుగుతుంది అని సమాచారం.
దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా టెంపర్ విజయం తర్వాత చేసిన జ్యోతి లక్ష్మి, లోఫర్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. అందువల్ల ఇజం చిత్ర విజయం అటు దర్శకుడిగా పూరికి, నటుడు నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ కి కీలకం గా మారింది. ముందు నుంచి ఈ చిత్రాన్ని దసరా బరిలో ఉంచాలని అనుకున్న చిత్ర వర్గం కాల పరిమితి వల్ల సినిమా నాణ్యతలో రాజి పడకూడదు అని చిత్ర విడుదలను వాయిదా వేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఇజం ఆడియోను ఈ నెల 5 వ తారీకున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నందమూరి తారక రామ ఆర్ట్స్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

