అజ్ఞ్యాతవాసి సినీ పోకడని వెనక్కు లాగుతోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ చిత్రం అజ్ఞ్యాతవాసి ఫలితం గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా అది వైఫల్య చిత్రం అనే చెప్పాలి తప్ప అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒక చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలని అందుకోలేక బోల్తా పడినప్పుడు ఆ సినిమా విడుదల హక్కులు పొంది విడుదల చేసుకున్న వారందరు నష్టపోవటం సర్వ సాధారణం. ఈ నష్టం ప్రత్యక్షంగా కనిపించే ఆర్ధిక నష్టం. అయితే అజ్ఞ్యాతవాసి ఘోర పరాజయంతో పరోక్షంగా మరో పెద్ద నష్టమే జరిగింది తెలుగు చలన చిత్ర పరిశ్రమకి.
ఈ మధ్యనే కొత్త తరం యువ దర్శకులు అవకాశాలు అందిపుచ్చుకుంటూ వాటిని సద్వినియోగపరచుకుంటూ ఘాజి, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, మళ్లీ రావా వంటి మంచి కంటెంట్ చిత్రాలని అందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు అజ్ఞ్యాతవాసి పరాజయం చెందటంతో సంక్రాంతి పండుగ సీజన్లో ప్రేక్షకుల సినిమా దాహం తీర్చే చిత్రం జై సింహ ఐయింది. 90 ల కాలంలో మనం ఎన్నో సినిమాలలో చూసేసిన సెంటిమెంట్, త్యాగం తోపాటు ఓల్డ్ మాస్ అంశాల మేళవింపుగా వచ్చిన జై సింహ ఇతర స్టార్ హీరోస్ సినిమాలు లేకపోవటంతో హిట్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రం సాధించిన అనుకోని విజయంతో కొత్త తరం దర్శకుల కంటే కే.ఎస్.రవికుమార్ వంటి మూస ధోరణి చిత్రాలు అందించే వారు మళ్లీ వారి ప్రయత్నాలు షురూ చేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమని మరో దశాబ్ద కాలం వెనక్కి తీసుకెళ్లే ప్రమాదం కూడా వుంది.

