క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్ సమ్మర్ వార్ సూపర్

టాలీవుడ్లో ఈ సమ్మర్ సినీ ప్రియులకు మంచి వినోదం అందించింది.. అందిస్తోంది.. ఇంకా అందించనుంది. ఇప్పటికే రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులు తిరగరాసిన రంగస్థలంకు పోటీగా భరత్ కూడా రికార్డుల వేటతో ఆట స్టార్ట్ చేసింది. ఇక ప్రస్తుతం థియేటర్లలో ఈ రెండు సినిమాల హడావిడితో పాటు బన్నీ నా పేరు సూర్య కూడా నడుస్తోంది.
సావిత్రి దుమ్ము రేపుతోంది....
ఇక తాజాగా వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి అయితే తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. మరో రెండు మూడు వారాల వరకు మహానటి జోరుకు బ్రేకులు ఉండవంటున్నారు. ఇక పూరి తనయుడు మెహబూబాకు మంచి టాక్ లేదు. ఇలా చాలా సినిమాలు థియేటర్లలో ఉండగానే ఇప్పుడు సమ్మర్లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి దిగనున్నాయి.
నేల టిక్కెట్ 24న....
వచ్చే వారం జంబలడికి పంబ, విజయ్ ఆంటోనీ కాశీ వస్తున్నాయి. ఇక ఈ నెల చివర్లో 24న రవితేజ - కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన నేల టిక్కెట్ వస్తోంది. 25న వస్తుందని అనుకున్న నాగార్జున - వర్మ ఆఫీసర్ అదే రోజు వస్తుందా ? వాయిదా పడుతుందా ? అన్నది తెలియట్లేదు. ఇక 25నే రావాల్సిన నా నువ్వే జూన్ 1కు వాయిదా పడింది.
రజనీ కాలా సినిమాతో....
జూన్ 1నే రాజూగాడు, నా నువ్వే, టాక్సీవాలాతో పాటు ఆఫీసర్ వాయిదా పడితే అదే రోజు అది కూడా రావచ్చు. ఇక ఈ నెల 18న రావాలనుకున్న విశాల్ అభిమన్యుడు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జూన్ ఫస్ట్ వీక్‌లో 7న రజనీ కాలా వస్తోంది. ఇలా భిన్నమైన జానర్లకు చెందిన సినిమాలు వరుసగా థియేటర్లలోకి దిగుతుండటంతో ఈ వేసవి సినీ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందివ్వనుంది.