Sat Dec 06 2025 08:40:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ తెలుగు కమెడియన్ మృతి
మంగళవారం విశాఖపట్నంలో ఆయన మరణించినట్లు డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు రమేశ్ హఠాన్మరణంపై..

టాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ గుండెపోటుతో మరణించారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మరణించినట్లు డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు రమేశ్ హఠాన్మరణంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. తాజాగా ‘మా విడాకులు’ సిరీస్‌లో నటి తండ్రిగా కనిపించారు. ఇటీవలే విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి సినిమాల్లోనూ అల్లు రమేశ్ నటించారు.
విశాఖపట్నానికి చెందిన అల్లు రమేశ్ తొలుత నాటకాలు వేసేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కమెడియన్ గా టాలీవుడ్ లో స్థిరపడ్డారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రసారమవుతోన్న మా విడాకులు సిరీస్ లోనూ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తున్నారు. ఈ సిరీస్ లో కూతురు-అల్లుడిని కలిపేందుకు ఆయన గుండెపోటు డ్రామా ఆడగా.. నిజజీవితంలో నిజంగానే ఆయన్ను గుండెపోటు మృత్యుఒడికి చేర్చిందంటూ నెటిజన్లు సంతాపం తెలుపుతున్నారు.
Next Story

